Home  »  News  »  160 కోట్లకు పైగా వసూళ్లు.. త్వరలోనే ఓటీటీలోకి సూర్య సూపర్ హిట్ మూవీ!

Updated : May 21, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎట్టకేలకు ఒక సాలిడ్ సక్సెస్‌తో బాక్సాఫీస్ వద్ద తన పవర్ ఏంటో నిరూపించుకున్నారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక నిరాశలో ఉన్న అభిమానులకు, ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా సరికొత్త జోష్ ఇచ్చింది. తమిళంలో 'కరుప్పు' పేరుతో, తెలుగులో 'వీరభద్రుడు'గా రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను విలక్షణ దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించడమే కాకుండా, ఇందులో పవర్‌ఫుల్ విలన్ రోల్‌లోనూ మెప్పించారు. ఎన్నో వాయిదాల తర్వాత మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సూర్య సరసన చెన్నై చంద్రం త్రిష హీరోయిన్‌గా నటించడంతో ఈ మూవీపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో హవా చూపిస్తున్న ఈ చిత్రం.. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 162 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఈ రేంజ్ రన్ కొనసాగుతుండగానే, మరోవైపు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, 'వీరభద్రుడు' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' దక్కించుకుంది. ఈ క్రేజీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు 35 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సూర్య మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగానే ఈ ఫ్యాన్సీ రేట్ పలికినట్లు తెలుస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంటాయి. ఈ నియమం ప్రకారమే, 'వీరభద్రుడు' కూడా జూన్ రెండో వారంలో ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

సినిమాలో సూర్య నటన, ఆర్‌జే బాలాజీ టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. 'ఆరు', 'సింగం' వంటి మాస్ చిత్రాల తర్వాత సూర్యను మళ్లీ పూర్తిస్థాయి పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో చూడటం చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తున్నారు. థియేటర్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం, ఓటీటీలోనూ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.