Home  »  News  »  Peddi: 'పెద్ది' ట్రైలర్ లాంచ్.. చిరంజీవి మాటలు గుర్తుచేసుకుని రామ్ చరణ్ ఎమోషనల్!

Updated : May 18, 2026

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ సినిమా జర్నీ గురించి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమాలో ఒక రెజ్లర్ (పహిల్వాన్) పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ముంబై మీడియా ప్రతినిధులతో చరణ్ మాట్లాడుతూ.. ఈ కథ విన్న వెంటనే తనకు శారీరకంగా ఇది ఎంతో సవాలుతో కూడుకున్నదని అర్థమైందని చెప్పారు. గతంలో బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', అమీర్ ఖాన్ 'దంగల్' వంటి సినిమాలతో పహిల్వాన్ పాత్రలకు ఒక ట్రెండ్ సెట్ చేశారని, వారి స్ఫూర్తితోనే తాను కూడా ఈ కఠినమైన ప్రయాణాన్ని నమ్మి ముందుకు సాగానని చరణ్ వివరించారు.

సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం దర్శకుడు బుచ్చిబాబు నిజమైన పహిల్వాన్లను రంగంలోకి దించారని చరణ్ వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఒరిజినల్ రెజ్లర్లు గట్టిగా పట్టుకోవడంతో చరణ్ మోకాలి కార్టిలేజ్ దెబ్బతిందని, అయినప్పటికీ ఆ నొప్పినంతా మర్చిపోయి కష్టపడ్డానని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి వర్కవుట్ చేసి సెట్స్‌కు వెళ్లేవాడినని, స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా షూటింగ్‌ను ఎంజాయ్ చేశానని తెలిపారు.

ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చూసిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌తో అన్న మాటలను ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. "చరణ్.. ఇలాంటి అద్భుతమైన కథలు, సినిమాలు ఒక నటుడి కెరీర్‌లో దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయి. ప్రతి ఏటా 'మగధీర' లేదా 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు రావు. కాబట్టి ఈ సినిమాలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చెయ్, ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ నీకు మళ్లీ దొరకకపోవచ్చు" అని చిరంజీవి చెప్పినట్లు చరణ్ ఎమోషనల్ అయ్యారు. 'మగధీర' తర్వాత 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' రావడానికి పదేళ్లు పట్టిందని, కానీ 'పెద్ది' రూపంలో తనకు చాలా త్వరగా మరో మైల్‌స్టోన్ లాంటి సినిమా దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌పై చరణ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. గతంలో చిరంజీవి గారు, శ్రీదేవి గారి కాంబినేషన్ వెండితెరపై సృష్టించిన మ్యాజిక్‌ను, తామిద్దరూ మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు గుర్తుచేస్తామని నమ్మకంగా చెప్పారు. జాన్వీ ముంబైలో ఉంటూనే సైలెంట్‌గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, తనకంటే 100 రెట్లు అద్భుతంగా డ్యాన్స్ చేసిందని, ఆమె డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానని చరణ్ కొనియాడారు.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చరణ్ కొనియాడారు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఒక మనిషి తన ఉనికిని (Identity) ఎలా వెతుక్కున్నాడనే ఒక బలమైన స్ఫూర్తిదాయకమైన కథతో వస్తున్న 'పెద్ది' చిత్రం తన లైబ్రరీలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అని చరణ్ ముగించారు

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.