Home  »  News  »  Balakrishna: లగ్జరీ కార్లు, కోట్లాది ఆస్తులు... కానీ చివరకి పాతాళ భైరవి అంజిగాడు విషాద కథ

Updated : May 18, 2026

 


వెండితెరపై తనదైన హాస్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించే  కొంత మంది హాస్యనటుల జీవితాల వెనుక ఎన్నో గుండె కోతలు, కన్నీటి గాథలు దాగుంటాయి. బ్లాక్‌బస్టర్ క్లాసిక్ 'పాతాళ భైరవి'లో ఎన్టీఆర్ పక్కన 'అంజిగాడు' రోల్ లో  అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులని  పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన సీనియర్ నటుడు వల్లూరి బాలకృష్ణ జీవితం  అలాంటి ఒక పెద్ద విషాదాంతమే. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో వెలిగిపోయి, లగ్జరీ కార్లలో తిరిగిన ఆయన, జీవిత చరమాంకంలో తిండికి కూడా లేక ఆకలి కేకల మధ్య కన్నుమూశారంటే నమ్మడం కష్టం. టాలీవుడ్ చరిత్రలో అత్యంత హృదయవిదారకమైన కథల్లో ఈయన కథ ఒకటిగా నిలిచిపోతుంది.

వల్లూరి బాలకృష్ణ 1925లో ఏలూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో చాలా బక్కపలుచగా ఉండటం వల్ల స్నేహితులు ఆయన్ని ఎగతాళి చేసేవారు. అయితే, తన శారీరక రూపాన్నే  ప్లస్ పాయింట్‌గా మార్చుకుని నాటకరంగం వైపు అడుగులు వేశారు. చదువు ఐదో తరగతితోనే ఆగిపోయినా, నటనపై ఉన్న మక్కువతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1951లో వచ్చిన 'పాతాళ భైరవి'  ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్రంలో అంజిగాడిగా ఆయన పండించిన హాస్యం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి  స్టార్ హీరోల సినిమాల్లోనూ, ముఖ్యంగా జానపద చిత్రాల బ్రహ్మ బి. విఠలాచార్య సినిమాల్లోనూ బాలకృష్ణ తప్పనిసరి నటుడిగా మారిపోయారు. 

విజయ్ సంస్థ నిర్మించిన అనేక క్లాసిక్ చిత్రాల్లో కూడా భాగమయ్యారు. 'మాయాబజార్'లో ఉత్తర కుమారుడికి చెలికాడుగా ఆయన చేసిన నటన సజీవంగా నిలిచిపోయింది. ఒక దశలో పద్మనాభం కంటే బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిన బాలకృష్ణ.. కెరీర్ ప్రారంభంలో కేవలం 15 రూపాయల పారితోషికం తీసుకుంటే, ఆ తర్వాత అది ఏకంగా 15వేల రూపాయలకు పెరిగింది. సుమారు 500 కి పైగా చిత్రాల్లో నటించి, అప్పట్లోనే కోట్లాది రూపాయల ఆస్తులు, లగ్జరీ కార్లని  సంపాదించారు. షూటింగ్‌లకి అత్యంత ఖరీదైన కార్లలో రావడం, రాచరికపు విలాసాలతో బతకడం బాలకృష్ణకి   అలవాటుగా మారింది

కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైభవం నెత్తినెక్కిన వేళ మనుషులు చేసే పొరపాట్లే వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. బాలకృష్ణకు ఏడుగురు ఆడపిల్లలు జన్మించారు. ఇల్లంతా మహాలక్ష్ములతో కళకళలాడుతుందని మొదట ఎంతో గర్వపడినప్పటికీ.. ఆయనకున్న కొన్ని చెడు అలవాట్లు ఆ సంసారాన్ని రోడ్డున పడేశాయి. సహాయం అని వచ్చిన వారికి లేదు అనకుండా చేతికి ఎముక లేకుండా దానం చేయడం ఒక ఎత్తయితే, విపరీతంగా మద్యానికి బానిస అవ్వడం ఆయన ఆర్థిక పతనానికి ప్రధాన కారణమైంది. మద్యపానం వల్ల షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు షూటింగ్‌లు రద్దవ్వడంతో ఇండస్ట్రీలో ఆయనపై నమ్మకం సడలిపోయింది, చెడ్డపేరు వచ్చింది. ఇదే సమయంలో కొత్త తరం హాస్యనటుల రాకతో బాలకృష్ణకి  అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  


Also read: Rashmika mandanna: రష్మికకి చేదు అనుభవం.. అసభ్యకరంగా ప్రవర్తించిన స్టార్ హీరో

ఆదాయం ఆగిపోవడం, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఆయన జీవితం అత్యంత దయనీయంగా మారింది. తన ఏడుగురు ఆడపిల్లలకు రోజుకు మూడు పూటలా కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితికి ఆయన చేరుకున్నారు. "నాడు కాస్ట్లీ కార్లలో తిరిగాను. నేడు నా బిడ్డలకి  కనీసం అన్నం కూడా పెట్టలేకపోతున్నాను" అని ఎన్నో  రాత్రులు నిద్రపట్టక ఒంటరిగా కుమిలిపోతూ ఏడ్చేవారట. స్టార్ హోదా నుండి ఒక్కసారిగా రోడ్డున పడిపోవడంతో తీవ్రమైన మానసిక ఆందోళన, ఆకలి కష్టాల మధ్య నలిగిపోతూ, కనీస వైద్య సదుపాయాలు కూడా లేక 1982లో హఠాత్తుగా కుప్పకూలి ఈ లోకాన్ని విడిచారు  ఆయన మరణవార్త విని ప్రాణ స్నేహితుడు పద్మనాభం కన్నీరుమున్నీరయ్యారు. బాలకృష్ణ కడసారి చూపుకి  కూడా ఎవరూ లేని ఆపన్న స్థితిలో, పద్మనాభమే దగ్గరుండి అంత్యక్రియల ఖర్చులు భరించి, తన స్నేహితుడికి సాగనంపారు.

వెండితెరపై కోట్లాది మందిని నవ్వించిన ఒక గొప్ప హాస్య నటుడి జీవితం ఇలా ఆకలి కేకలు, కన్నీళ్ల మధ్య ముగిసిపోవడం సినీ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంతో పాటు  సినీ రంగానికి ఎప్పటికీ ఒక హెచ్చరిక. బాలకృష్ణ వెండితెరపై కనిపించిన చివరి చిత్రం    'బలిదానం'.  

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.