Home  »  News  »  Bad Boy Karthik Review: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ రివ్యూ.. నాగశౌర్య సర్‌ప్రైజ్ చేశాడా?

Updated : Apr 17, 2026

  • తారాగణం: నాగశౌర్య, విధి యాదవ్, శ్రీదేవి విజయ్ కుమార్, సాయి కుమార్, సముద్రఖని, మైమ్ గోపి తదితరులు
  • సంగీతం: హారిస్ జయరాజ్
  • సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
  • ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • యాక్షన్ కొరియోగ్రఫీ: సుప్రీమ్ సుందర్, పృథ్వీ
  • దర్శకత్వం: రమేష్ దేశిన
  • బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిలింస్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 17, 2026

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik). విధి యాదవ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నేడు (ఏప్రిల్ 17) థియేటర్లలోకి వచ్చింది. ప్రచార చిత్రాలు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేకపోయాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కంటెంట్ తో ఏమైనా సర్‌ప్రైజ్ చేసిందా? (Bad Boy Karthik Movie Review)

కథ:
వైజాగ్‌లో తన సోదరి కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్), బావ (అజయ్)తో కలిసి కార్తీక్ (నాగశౌర్య) నివసిస్తుంటాడు. కార్తీక్ అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కస్తూరి ఆశపడుతుంటుంది. ఈ క్రమంలో కార్తీక్, ఏసీపీ సాయి (సాయి కుమార్) కుమార్తె మహాలక్ష్మి (విధి యాదవ్) ప్రేమలో పడతాడు. అయితే, కస్తూరి ప్రాణాలకు కొంతమంది గూండాల నుండి ముప్పు పొంచి ఉందని కార్తీక్‌కు తెలుస్తుంది. తన అక్కను చంపాలని చూస్తున్నది ఎవరు? కదిరి ప్రాంతానికి చెందిన గోవిందప్ప (మైమ్ గోపి), వరద రెడ్డి (సముద్రఖని)లకు ఈ గొడవతో సంబంధం ఏంటి? చివరకు కార్తీక్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:
ఈ సినిమా ప్రధాన లోపం దాని కథలోనే ఉంది. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం నాటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను 2026లో ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. ఇటీవలి కాలంలో ఓల్డ్ టెంప్లేట్ లో వచ్చిన స్టార్ హీరోల సినిమాలనే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. హీరో ఎవరనేది సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అలాంటిది కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇప్పుడు ఈ సినిమా రావడం సాహసమే.

దర్శకుడు రమేష్ ఎంచుకున్న పాయింట్‌లో కొత్తదనం లేదు. కనీసం స్క్రీన్‌ప్లే అయినా వేగంగా ఉందా అంటే అదీ లేదు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా కొత్తదనం కనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్లు చాలా ఊహజనితంగా ఉంటాయి. క్లైమాక్స్ కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సాయి కుమార్ లాంటి సీనియర్ నటుడి పాత్రను కూడా చాలా పేలవంగా డిజైన్ చేయడం సినిమా గ్రాఫ్‌ను పడేసింది.

వరుస పరాజయాలతో ఉన్న నాగశౌర్యకు ఈ సినిమా చాలా కీలకం. అయితే కథల ఎంపికలో ఆయన మళ్ళీ తడబడ్డారనే చెప్పాలి. 'ఛలో' వంటి యూత్ ఫుల్ సినిమాలతో మెప్పించిన శౌర్య, ఇలాంటి రొటీన్ యాక్షన్ సినిమాల కంటే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటే బాగుంటుంది.

నటీనటుల పనితీరు:
నాగశౌర్య ఈ సినిమాలో లుక్ పరంగా కొంచెం కొత్తగా కనిపించినా, పాత్రలో బలం లేకపోవడంతో ఆయన నటన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హీరోయిన్ విధి యాదవ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన సాదాసీదాగా ఉన్నాయి. శ్రీదేవి విజయ్ కుమార్ తన నటనతో మెప్పించింది. సాయి కుమార్, సముద్రఖని, మైమ్ గోపి వంటి నటులు ఉన్నప్పటికీ, వారి పాత్రలు రొటీన్‌గా ఉండటంతో పెద్దగా స్కోప్ దక్కలేదు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు రమేష్ ఎంచుకున్న కథ 20 ఏళ్ల క్రితం నాటిదిగా అనిపిస్తుంది. నేటి కాలానికి తగ్గట్టుగా కథనంలో మార్పులు చేయకపోవడం పెద్ద మైనస్. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ ఒకప్పటి మ్యాజిక్ పూర్తిగా మిస్ అయింది. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది, విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. పాటలు, ఫైట్లు కోసం భారీగానే ఖర్చు చేశారు. కానీ సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయినట్లు కనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
ఔట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సీన్స్

ఫైనల్ గా..
'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా కాలం చెల్లిన ఫార్ములాతో వచ్చిన యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు కమర్షియల్ హంగులు అద్దాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. మాస్ మసాలా సినిమాలను ఇష్టపడే వారికి కూడా ఇది నచ్చడం అనుమానమే.

రేటింగ్: 1.75/5

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.