![]() |
![]() |

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), కేవలం తన గ్లామర్‌తోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. 'దేవర'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు రామ్ చరణ్ సరసన 'పెద్ది'లో నటిస్తోంది. తాజాగా ఆమె 'మద్యపాన వ్యసనం' (Alcohol Addiction) గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఒక కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ.. మన దేశంలో మద్యపాన వ్యసనం గురించి జరిగే చర్చలు చాలా తక్కువని, ఒకవేళ చర్చ జరిగినా అది కేవలం ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటానికే పరిమితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. "ఎవరైనా మద్యానికి బానిసయ్యారంటే వారిని ఒక రోగిగా చూడాలి కానీ, వారి క్యారెక్టర్‌ను జడ్జ్ చేయకూడదు" అని ఆమె పేర్కొంది. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య అని గుర్తించకపోవడం వల్లే చాలామంది సాయం కోరడానికి భయపడుతున్నారని ఆమె వివరించింది.
చాలా సందర్భాల్లో ఒత్తిడి, ఒంటరితనం నుంచే వ్యసనాలు మొదలవుతాయని జాన్వీ అభిప్రాయపడింది. "మనం శారీరక గాయాలకు చికిత్స చేయించుకున్నట్లే, మానసిక సమస్యలకు కూడా చికిత్స అవసరం. కానీ మన సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటాన్ని నేటికీ ఒక తప్పుగా చూస్తున్నారు" అని ఆమె చెప్పుకొచ్చింది. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇటువంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడటం వల్ల బాధితుల్లో ధైర్యం పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
జాన్వీ కపూర్ కి కూడా మద్యం అలవాటు అయింది. అది వ్యసనంగా మారుతుండంతో ఆమె దానికి దూరమైంది. దీనిపై జాన్వీ మాట్లాడుతూ.. "అప్పుడప్పుడు నేను మద్యం తీసుకునే దానిని. నాకు తెలియకుండానే నేను దానికి బానిసగా మారిపోయా. నా చుట్టూ ఉన్న చాలామంది ఆ వ్యసనానికి బలికావడం ప్రత్యక్షంగా చూశా. వ్యసనం కూడా ఓ మానసిక ఆరోగ్య సమస్య అని గుర్తించా. వ్యసనం కారణంగా జీవితంలో ఏం కోల్పోతామో, ఎంత నష్టం జరుగుతుందో తెలిసిన తర్వాత.. ఆ అలవాటుకి దూరమయ్యాను" అని చెప్పుకొచ్చింది.
శారీరక దృఢత్వం కంటే మానసిక ఆరోగ్యమే ముఖ్యమని జాన్వీ అభిప్రాయపడింది. తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, ఒత్తిడిని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తనను తాను నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం చేయడంతో పాటు సరైన జీవనశైలిని ఎంచుకున్నట్లు తెలిపింది. "మనం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బయట ప్రపంచానికి సంతోషంగా కనిపిస్తాము. ఏదైనా వ్యసనానికి బానిస అవ్వడం కంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం" అని జాన్వీ కపూర్ యువతకు సందేశం ఇచ్చింది.
![]() |
![]() |