![]() |
![]() |
- సినిమాలో దళపతి సాంగ్ బిట్
- కాపీరైట్ విషయంలో ఇళయరాజా సీరియస్
- అనిల్ రావిపూడి క్లారిటీ
పటాస్‌తో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. అపజయం అనేది లేకుండా వరస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 8 సినిమాలు డైరెక్ట్ చేసిన అనిల్.. 9వ సినిమాగా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో చేసిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మరో విజయం సాధించారు. ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మెగా బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాలుగా మేస్ట్రో ఇళయరాజా తన పాటల కాపీరైట్ విషయంలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తన పాటలను ఏ సినిమాలో ఉపయోగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చివరికి వేదికలపై తన పాటలు పాడినా వాటికి రాయల్టీ వసూలు చేస్తున్నారు. అందుకే ఇళయరాజా పాటల్ని తమ సినిమాల్లో వాడేందుకు మేకర్స్ భయపడుతున్నారు.
ఇక ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం విషయానికి వస్తే.. ఇందులో ‘దళపతి’ చిత్రంలోని సాంగ్ బిట్‌ను ఉపయోగించారు. సినిమా చూసిన వారంతా ఇళయరాజా వల్ల చిత్ర యూనిట్‌కి ఇబ్బందులు తప్పవు అనుకున్నారు. ఇదే విషయాన్ని థాంక్యూ మీట్‌లో ప్రస్తావించింది మీడియా. దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సాంగ్ బిట్ వాడటం గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
‘మా సినిమాకి సంబంధించి ప్రతి విషయం ఎంతో పద్ధతిగా జరిగింది. ఏదీ మా ఇష్టారాజ్యంగా చెయ్యలేదు. సినిమాలో దళపతి సాంగ్ బిట్ ఉండాలని మేం అనుకున్నప్పుడు నిర్మాతలు స్వయంగా ఇళయరాజాగారిని కలిశారు. చిరంజీవిగారి సినిమాలో ఆ పాటను వాడుకోవడానికి అనుమతి కావాలని ఆయన్ని కోరారు. దానికి ఎంతో సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇళయరాజా. అందుకే ఆ సాంగ్ బిట్‌కి సంబంధించి ఎలాంటి చిక్కులు, వివాదం రాలేదు’ అంటూ వివరించారు అనిల్ రావిపూడి.
![]() |
![]() |