![]() |
![]() |

సినిమా పేరు: ఈషా
నటీనటులు: హెబ్బా పటేల్, బబ్లూ పృథ్వీ, అదిత్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, మైన్ మధు తదితరులు
సినిమాటోగ్రఫీ: సంతోష్ షనమోని
ఎడిటర్: వినయ్ రామస్వామి
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
రిలీజ్: బన్నీ వాసు వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్
సమర్పణ: కే ఎల్ దామోదర్ ప్రసాద్
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మన్నే
రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 ,2025
హర్రర్ థ్రిల్లర్ సినిమాల రాక ఈ మధ్య కాలంలో తక్కువ అయ్యింది. దీంతో హర్రర్ జోనర్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులు ఆ తరహా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో 'ఈషా' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. సినిమాపై నమ్మకంతో మేకర్స్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.
కథ
నయన( హెబ్బా పటేల్), కళ్యాణ్ (ఆదిత్ అరుణ్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) లు స్కూల్ డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్.ఆ ఏజ్ నుంచే మనిషి చనిపోయాక ఆత్మలు ఉండవనే బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. అందుకు తగ్గట్టే ఆత్మలు ఆవహించాయనే పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే అన్ని మతాలకి చెందిన స్వామిజీలని ప్రూఫ్స్ తో సహా చట్టం ముందు ఉంచుతారు. ఆ నలుగురి నెక్ట్ టార్గెట్ ఆదిదేవ్( బబ్లూ పృథ్వీ) అవుతాడు. ఆదిదేవ్ ఎంతో ఎడ్యుకేట్ పర్సన్ తో పాటు వైద్య వృత్తికి సంబంధించి అమెరికాలో ఫేమస్ న్యూరాలజిస్ట్ గా పని చేసాడు. అలాంటి ఆదిదేవ్ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో ఆత్మలని వదిలించే స్వామిజీగా ఉంటుంటాడు.నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆదిదేవ్ ని కలుస్తారు. ఈ క్రమంలో ఆ నలుగురి జీవితాలకి సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఆదిదేవ్ కి తెలుస్తుంది. దీంతో ఆ నలుగురి జీవితాల్లో పలు మార్పులు సంభవిస్తాయి.పైగా ఆ నలుగుర్ని చంపడానికి పుణ్యవతి అనే మహిళ ఆత్మ ప్రవేశించిన ఒక శివ భక్తుడు(మైన్ మధు)ప్రయత్నిస్తుంటాడు. ఆదిదేవ్ కి ఆ నలుగురు గురించి తెలిసిన నిజం ఏంటి? శివ భక్తుడు ఎందుకు ఆ నలుగుర్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు? పుణ్యవతి ఎవరు? ఆమెకి ఆ నలుగురికి సంబంధం ఏంటి? ఉంటే ఎలాంటి సంబంధం? ఆత్మల పేరుతో ఆదిదేవ్ నిజంగానే ప్రజలని మోసం చేస్తున్నాడా? న్యూరాలజిస్ట్ స్వామిజీగా మారడానికి కారణం ఏంటి? ఆత్మలు లేవని ఆ నలుగురు నిరూపించారా? అసలు ఈషా అంటే ఏంటి అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
కథ గా చెప్పుకుంటే చాలా మంచి కథ. కోరికలు, ఆశలు తీరని వారు చనిపోయినప్పుడు , వాళ్ళు మరణించారని ప్రకృతి చెప్తున్నా వాళ్ళు ఆ విషయాన్నీ ఎలా ఒప్పుకోరో కూడా చెప్పింది. ఈ కథ మెయిన్ పాయింట్ కూడా ఇదే. కాకపోతే ఈ విషయం క్లైమాక్స్ లో తెలుస్తుంది. సదరు పాయింట్ తెలిసినప్పుడు ఎంతో థ్రిల్ కూడా ఫీలవుతాం. కానీ సదరు మెయిన్ పాయింట్ కి సింక్ అయ్యే సన్నివేశాల రూపకల్పనలో మేకర్స్ ఎక్కువ శ్రద్ద చూపించలేకపోయారు.
కాని సదరు సన్నివేశాలు మనకి ఎక్కడ బోర్ కొట్టవు. అందుకు తగ్గట్టే ఫొటోగ్రఫీ, దర్శకత్వం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మెస్మరైజ్ చేసాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం నుంచే పదునైన స్క్రీన్ ప్లే తో నడిచింది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. కాకపోతే చిన్న వయసు నుంచే నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆత్మలు లేవు అనే బలమైన నమ్మకాన్నికలిగి ఉండటానికి డైలాగు ద్వారా చెప్పకుండా సన్నివేశం ద్వారా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే కథ మెయిన్ పాయింట్ ఆత్మలు లేవనే నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి.
పుణ్యవతి ఎపిసోడ్ పరిధిని ఇంకొంచం పెంచాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ వేగంగానే నడిచినా భయపెట్టే సీన్స్ రిపీట్ గా వచ్చినట్టుగా ఉంది.ఆది దేవ్ కి నలుగురు గురించి ముందుగానే తెలుసు కాబట్టి ఆదిదేవ్ ని చెడ్డ వ్యక్తిగా చీట్ చేస్తు చూపించాల్సింది. ఆత్మ రూపంలో శివ భక్తుడులో ప్రవేశించిన పుణ్యవతి తన కొడుకు, భర్త దగ్గరకి వెళ్లి తమ కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలని చెప్పి ఉంటే బాగుండేది. దీనివల్ల సెంటి మెంట్ వర్క్ అవుట్ అయ్యి ఈషా కి సరికొత్త లుక్ వచ్చి ఉండేది. ఆర్ ఆర్ సౌండ్ కి క్యారెక్టర్స్ భయపడటం కొంచం ఎక్కువ అయినట్టుగా అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఆదిదేవ్ స్వామిజీగా కొనసాగడానికి గల కారణాన్ని కూడా సన్నివేశాల రూపకల్పనలో చెప్పి ఉంటే ఒకే పాయింట్ పై కథ నడుస్తున్న ఫీలింగ్ కొంత తగ్గేది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
హెబ్బా పటేల్(Hebah Patel),ఆదిత్ అరుణ్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్ నటనలో మెరుపులు లేకపోయినా కథకి తగ్గ నటనని ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. బబ్లూ పృథ్వీ కూడా అంతే. మెరుపులు లేకపోయినా మరో సారి మెచ్యూర్డ్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. శివ భక్తుడిగా, మహిళ ఆత్మ ప్రవేశించిన వ్యక్తిగా మైమ్ మధు పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మొత్తంలో తన నటనే హైలెట్. బిజీ ఆర్టిస్ గా మారడం ఖాయం. ఫొటోగ్రఫీ అత్యద్భుతంగా ఉండి 'ఈషా' కి ప్రధాన వెన్నెముక గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే క్రెడిట్ ఇవ్వచ్చు. ఒక కొత్త లోకాన్ని మన కళ్ళ ముందు ఉంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మన్నే శ్రీనివాస్(Srinivas Manne)దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. కానీ రచన పరంగా మరింత శ్రద్ద చూపించాల్సింది.
ఫైనల్ గా చెప్పాలంటే కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నా వాటిని మర్చిపోయేలా రెండుగంటల ఏడు నిమిషాల నిడివితో ఈషా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. హార్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులని మాత్రం నిరాశపరచదు.
రేటింగ్ 2 .75 /5 అరుణాచలం
![]() |
![]() |