![]() |
![]() |
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డిసెంబర్ 24న సచివాలయంలో జరిగిన సినిమా టికెట్ హేతుబద్దీకరణ కమిటీ సమీక్షా సమావేశం అనంతరం సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల గురించి వివరించారు.
ప్రతి సినిమా బడ్జెట్‌ను బట్టి విడివిడిగా జీవోలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. ఒకే విధానం కింద టికెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సినిమా పరిశ్రమ మనుగడ సాగించడంతోపాటు, సామాన్య ప్రేక్షకుడిపై భారం పడకుండా సమతుల్యత పాటించే దిశగా అడుగులు వేస్తున్నాం.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం. పెద్ద బడ్జెట్ సినిమా, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల ధరలు పెంచే విధానం పరిశీలిస్తున్నాం. త్వరలోనే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో సమావేశం నిర్వహిస్తాం. పరిశ్రమ సమస్యలు కూడా విని పరిష్కరిస్తాము. తెలుగు సినిమా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయింది. పాన్ ఇండియా సినిమా వల్ల నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోంది.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏపీలో సినిమా టికెట్ల రేట్ల హేతుబద్దీకరణపై ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్, ఏపీ ఎస్‌ఎఫ్ టీవీ మరియు టీడీసీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, లా డిపార్ట్ మెంట్ సెక్రటరీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సమీక్షా సమావేశం ఇవాళ జరిగింది. మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల హేతుబద్దీకరణపై, హై బడ్జెట్ సినిమా టికెట్ల పెంపునకు అనుసరించాల్సిన విధానాలపై కమిటీ చర్చించింది. సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.
ఇప్పటివరకు పాత జీవో ప్రకారం హౌం శాఖ ద్వారా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నాం. ప్రస్తుతం లో బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు ఎంత ధర ఉండాలనే అంశంపై కమిటీ చర్చిస్తోంది. ఎంత శాతం ఏపీలో చిత్రీకరణ జరపాలన్న అంశంపై నిబంధనలు నిర్ణయిస్తాం. షూటింగులతోపాటు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయి. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలోనే కొత్త జీవో జారీ చేస్తాం. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత నిర్మాతలకు ప్రభుత్వం అండగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇండియాలో ఏపీని చలచిత్ర నిర్మాణానికి ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహిస్తాం అని వివరించారు మంత్రి కందుల దుర్గేష్.
అంతకుముందు కమిటీ సభ్యులు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూచిభొట్ల వివేక్, దర్శకులు జాస్తి ధర్మతేజ, డిస్ట్రిబ్యూటర్ నక్కలపూడి సాయిబాబు, ఎగ్జిబిటర్ సోంపల్లి శివప్రసాద్ తదితరులు మంత్రి దుర్గేష్‌తో పేషీలో భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం మంత్రి దుర్గేష్‌ను సత్కరించారు.
![]() |
![]() |