Home  »  News  »  కాంత మూవీ రివ్యూ 

Updated : Nov 13, 2025

 

సినిమా పేరు:కాంత 
తారాగణం:  దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని,రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు 
మ్యూజిక్: జాను చంతర్. జెక్స్ బిజోయ్  
రచన, దర్శకత్వం:సెల్వమణి సెల్వరాజ్
సినిమాటోగ్రాఫర్: డాని సాంచెజ్-లోపెజ్
ఎడిటర్ : అంథోని 
బ్యానర్స్:స్పిరిట్ మీడియా, వేఫెరెర్ ఫిల్మ్స్ 
నిర్మాత: దుల్కర్ సల్మాన్,రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి 
విడుదల తేదీ: నవంబర్ 12 , 2025 

 

అభిమానులతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్  ఎంతగానో ఎదురుచూస్తున్న 'కాంత'(kaantha)మూవీ థియేటర్స్ లో కి వచ్చేసింది. లక్కీ భాస్కర్ వంటి ఘనవిజయం తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer salmaan)సిల్వర్ స్క్రీన్ పై మెరవడం, అగ్ర హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్న భాగ్యశ్రీ బోర్సే(Bhaghyashri Borse),దుల్కర్ కి జత కట్టడంతో కాంత పై మంచి అంచనాలే ఉన్నాయి.పాన్ ఇండియా కటౌట్ రానా(Rana daggubati)కీలక పాత్రలో చెయ్యడం కూడా ఈ చిత్రం స్పెషాలిటీ. మొట్టమొదటి తమిళ హీరో త్యాగరాజ భాగవతార్ జీవిత కథ అనే ప్రచారం కూడా ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

 

కథ

టికే మహదేవన్(దుల్కర్ సల్మాన్) తెలుగు సినిమా రంగంలో పెద్ద హీరో. నటచక్రవర్తి అనే బిరుదుతో లక్షలాది మంది అభిమానులని కలిగిన ఒక శక్తి. భార్య పేరు దేవి. apk ఉరఫ్ అయ్య(సముద్ర ఖని)ప్రతిభావంతమైన దర్శకుడు. సదరు దర్శక రంగంలోనే ఎవరెస్టు శిఖరం లాంటి వ్యక్తి. మహదేవన్, అయ్య కి ఒకరంటే ఒకరికి ద్వేషభావం. కానీ ఈ ఇద్దరి కాంబోలో 'శాంత' అనే మూవీ షూటింగ్ కి వెళ్తుంది. తన ఇగోతో శాంత ని కాస్త కాంతగా మహదేవన్ పేరు మారుస్తాడు. కుమారి(భాగ్యశ్రీ బోర్సే) ఆ మూవీలో హీరోయిన్. అనాధ అయిన కుమారిని అయ్య నే చేరదీసి హీరోయిన్ గా మొదటి అవకాశం ఇస్తాడు. మహదేవన్ మంచి వాడు కాదని, నమ్మక ద్రోహానికి మారుపేరని క్లోజ్ గా ఉండవద్దని కుమారికి షూటింగ్ ప్రారంభంలోనే అయ్య చెప్తాడు. కానీ కుమారి, మహదేవన్  ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు.ఒకరంటే ఒకరికి ఆరాధన భావం కూడా ఉంటుంది. కానీ  షూటింగ్ చివరి రోజున కుమారి హత్య చేయబడుతుంది. కుమారి ని చంపింది ఎవరు? మహదేవన్ నిజంగానే కుమారిని ప్రేమించాడా? లేక ప్రేమ అనేది నాటకమా? అసలు అయ్య కి మహదేవన్ మధ్య ఎందుకు గొడవలు? అంత గొడవల మధ్య ఆ ఇద్దరే కాంత సినిమాని ఎందుకు చెయ్యవలసి వచ్చింది? షూటింగ్ లో ఎలాంటి  గొడవలు జరిగాయి? మహదేవన్ చెడ్డవాడని అయ్య చెప్పినా కుమారి ఎందుకు ప్రేమించింది? మహదేవన్ చెడ్డవాడు కాదా?  ఈ కథ లో రానా పోషించిన ఫోనిక్స్ క్యారక్టర్  ఏంటి? అసలు కుమారిని ఎవరు చంపారు? అనేదే కాంత కథ 


ఎనాలసిస్ 

ఈ రోజుల్లో కొంత మంది ఎందుకు ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా సినిమాలని తెరకెక్కిస్తున్నారు. అలాంటి వారందరిని కాంత సినిమా ఒక్కసారిగా ఆలోచనలో పడేస్తుందని చెప్పుకోవచ్చు. సినిమా అంటే ప్రేక్షకులు ఊహించని విధంగా ప్రవర్తించే  క్యారెక్టర్స్, చిత్రీకరణ, నటీనటుల భావోద్వేగాలు అని కాంత చెప్పినట్లయింది. ఒక రకంగా గత సినిమాల యొక్క వైభవాన్ని మరోసారి మన కళ్ళ ముందు ఉంచింది. కాకపోతే అయ్య, మహదేవన్ క్యారక్టర్ మధ్య జరిగిన గత కథ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.

 

అయ్య క్యారక్టర్ లో సముద్ర ఖని కాకుండా దుల్కర్ కి సమానమైన హీరో ఎవరైనా చేసి ఉంటె ఇంకా బాగుండేదేమో. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ప్రారంభంలోనే కాంత కథ యొక్క ఉద్దేశ్యం చెప్పేసారు. కానీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు నటీనటుల పెర్ ఫార్మెన్స్ కట్టిపడేస్తుంది. మహదేవన్, అయ్య మధ్య షూటింగ్ సందర్భంగా వచ్చిన సీన్స్ కట్టిపడేశాయి. కుమారి, మహదేవన్ మధ్య లవ్ సీన్స్ కట్టిపడేశాయి. ఈ ఇద్దరి లవ్ సీన్స్  విషయంలోనే షూటింగ్ జరిగేటప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది.    తద్వారా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ లేదనే లోటు తీరేది. కుమారి ని మరింత యాక్టీవ్ గా చూపిస్తూ ఉండాల్సింది.

 

రానా పోషించిన ఫోనిక్స్ క్యారక్టర్ ని తన పోలీస్ డ్యూటీ లో భాగంగా ఇంటర్వెల్ కి ముందు పరిచయం చేసి, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కాంత కథలోకి ఎంటర్ అయినట్టు చూపించాల్సింది. ఇంటర్ వెల్ ట్విస్ట్ మాత్రం సూపర్. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చిన ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా వచ్చింది.ఎంతలా అంటే ఏ నిమిషం ఏం జరుగుతుంది. ఎవరు కుమారి ని హత్య చేసారు అనే సస్పెన్సు హండ్రెడ్ పర్శంట్ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సందర్భంగా ఫోనిక్స్ క్యారక్టర్ ప్రవర్తించే తీరు కూడా ఆకట్టుకుంది. కాకపోతే సదరు క్యారక్టర్ ఓవర్ డోస్ గా ప్రవర్తించడానికి ఒక రీజన్ చెప్పుండాలసింది. కుమారి గతాన్ని కూడా ఒక కథగా చెప్పి సన్నివేశాలు సృష్టించి ఉంటే సదరు క్యారక్టర్ పై ఇంకొంచం జాలి కలిగేది.

 

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన కళ్ళతో చూసింది, చెవులతో విన్న వాటిల్లో నిజం ఉండదు.   అహంకారంతో కళ్ళు మూసుకొని పోయి అవతలి వారు చెప్పేది  పూర్తిగా వినకపోతే పక్క వారి జీవితాలని నాశనం చెయ్యడమే కాకుండా, మన జీవితంలో అమృతాన్ని పంచే ప్రేమని ఎలా దూరం చేసుకుంటామో అనే జీవిత సత్యాన్ని కూడా కాంత చెప్పింది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

నటీనటులు తో పాటు 24 క్రాఫ్ట్స్ పని తీరు ఎలా ఉందని అనే కంటే కాంత సినిమా కోసమే వాళ్లంతా పుట్టారా అని అనిపిస్తుంది. అంతలా తమ పనితనంతో మెస్మరైజ్ చేసారు. ముందుగా మహదేవన్ గా దుల్కర్ సల్మాన్ నటన ఎవరెస్టు శిఖరాన్ని అందుకుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి సన్నివేశం దాక వీరవిహారం చేసాడు.చిన్న చిన్న ఎక్స్  ప్రెషన్స్ లో కూడా అద్భుతంగా నటించి నిజంగానే నట చక్రవర్తి అనిపించుకున్నాడు.  తన సినీ జీవితంలో మహదేవన్ క్యారక్టర్ చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఇక కుమారి గా భాగ్యశ్రీ బోర్సే నటన గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. తనలో ఇంత పెర్ ఫార్మెన్సు ఉందా అనే ఆశ్చర్యం కూడా కలగక మానదు. కళ్ళతోనే హవ భావాలని పర్ఫెక్ట్ గా ప్రదర్శించే మరో నటి భాగ్యశ్రీ రూపంలో భారతీయ చిత్ర పరిశ్రమకి దొరికినట్లయింది. త్వరలోనే అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమని ఏలడం ఖాయం. ఇక అయ్య గా సముద్ర ఖని మరోసారి బెస్ట్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. తన క్యారక్టర్ లో భిన్నమైన వేరియేషన్స్ లేకపోయినా తనని వర్సటైల్ నటుడని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు. ఫినిక్స్ అనే పోలీస్ ఆఫీసర్ గా రానా ఎనర్జిటిక్ గా నటించడంతో పాటు పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.

 

మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేక పోయినా మహదేవన్ భార్యగా చేసిన నటి తో పాటు అందరు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతిక పరంగా చూసుకుంటే ఫొటోగ్రఫీ ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్సు కి ధీటుగా పని చేసింది. అంతలా ప్రతి ఫ్రేమ్ ని తన పని తనంతో నింపేసి సినిమాకి సరికొత్త వన్నె తెచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  బాగా ప్లస్ అయ్యింది. సాంగ్స్ తక్కువే అయిన అర్థమవంతమైన సాహిత్యంతో ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పుకుందామన్నా ఈ విషయంలో కూడా ఫొటోగ్రఫీ ఆ అవసరాన్ని కలిపించలేదు. దర్శకుడుగా,రచయితగా సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి నటనని రాబట్టడంలో కాంప్రమైజ్ కాలేదు.

 

ఫైనల్ గా చెప్పాలంటే కథ, కథనాలు నలుగురి వ్యక్తుల మధ్యనే జరిగినా కూడా నటీనటుల ఎవర్ గ్రీన్ పెర్ ఫార్మెన్స్, సస్పెన్సు, ప్రేమ వంటి అంశాలు కాంత ని మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది.

 

రేటింగ్ 2 .75 /5         
                                                                                                                          అరుణాచలం 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.