సంధ్య థియేటర్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, సంఘాలు ఘటన పట్ల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో దీనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. కొందరు ఆకతాయిలు ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.