1993లో అర్జున్ హీరోగా రూపొందిన ‘జెంటిల్‌మేన్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఒక్కసారిగా అందర్నీ ఆకర్షించాడు. సినిమాలు ఇలా కూడా తియ్యొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ తర్వాత చేసిన ‘ప్రేమికుడు’ చిత్రం యూత్‌ని ఉర్రూతలూగించింది. మూడో సినిమాగా కమల్‌హాసన్‌తో చేసిన ‘భారతీయుడు’ దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించి టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన సినిమాగా సంచలనం సృష్టించింది. అయితే ఆ సినిమాకి సీక్వెల్‌గా దాదాపు 29 సంవత్సరాల తర్వాత ‘భారతీయుడు2’ వచ్చింది. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ, ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫలితంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమా చివరలో ‘భారతీయుడు3’ వచ్చే ఏడాది రాబోతోందని ట్రైలర్‌ని రుచి చూపించారు.
‘భారతీయుడు2’ ఫ్లాప్ అవ్వడం వల్ల రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’పై ఆ ప్రభావం పడుతుందేమోనని చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ‘భారతీయుడు3’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలు చేయలేకపోతున్నారని, అందుకే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం జోరందుకుంది. దీంతో శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న భారతీయుడు3 ఓటీటీలో రిలీజ్ అవుతోందంటే.. రామ్‌చరణ్‌తో చేసిన గేమ్ ఛేంజర్ ఎలా ఉండి ఉంటుంది అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.
భారతీయుడు3కి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదింపేందుకు దర్శకుడు శంకర్ ముందుకొచ్చాడు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఇండియన్2’ చిత్రానికి అంత నెగెటివ్ టాక్ వస్తుందని ఊహించలేదు. అందుకే నా డైరెక్షన్‌లోనే వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అలాగే ‘భారతీయుడు3’ చిత్రాన్ని అందరూ థ్రిల్ అయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నాను. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు శంకర్.