![]() |
![]() |

సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. 2015 లో వచ్చిన 'టైగర్' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిదే. మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు వీఐ ఆనంద్ కూడా తన గత చిత్రం 'డిస్కో రాజా'తో ప్లాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 'ఊరు పేరు భైరవకోన' కోసం చేతులు కలిపారు. అయితే తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే.. వీరిద్దరూ ఒకేసారి హిట్ కొట్టేలా ఉన్నారు.
'ఊరు పేరు భైరవకోన' మూవీ టీజర్ ను ఆదివారం విడుదల చేశారు. "శ్రీకృష్ణదేవరాయ కాలంలో చలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి" అనే వాయిస్ తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. "గరుణ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన" అంటూ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. "ఈ ఊరిలోకి రావడమే గానీ బయటకు పోయే దారే లేదు" అని టీజర్ లో చూపించారు. అసలు ఆ ఊరిలో దాగున్న మిస్టరీ ఏంటి? దానిని కథానాయకుడు ఎలా ఛేదించాడు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఇలాంటి హారర్ మిస్టరీ కథాంశంతో రూపొందిన 'విరూపాక్ష' ప్రేక్షకులను మెప్పించి ఘన విజయం సాధించింది. 'ఊరు పేరు భైరవకోన' టీజర్ చూస్తుంటే అంతకుమించి థ్రిల్ చేసేలా ఉంది.
ఏకే ఎంటెర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య తాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రాజ్ తోట, ఎడిటర్ గా చోటా కె.ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |