![]() |
![]() |

ఇటీవల సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. మొదట ఆయనను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాస్త కుదుటపడిన ఆరోగ్యం, మళ్ళీ విషమించడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా వైద్యులు ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు ఆయన త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కుటుంబసభ్యులు, సన్నిహితులు కోరుకుంటుండగా.. మరోవైపు ఆయన చనిపోయారంటూ కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
శరత్ బాబు కన్నుమూశారంటూ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నమ్మి ఎన్నో వెబ్ సైట్లు ఆత్రంతో ఆయన మృతి చెందారని రాసుకొచ్చాయి. ముఖ్యంగా తమిళ్ లో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఆయన మరణించారని ప్రసారం చేసింది. ఈ వార్తలతో కుటుంబసభ్యులు ఎంతో ఆవేదన చెందారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని, శరత్ బాబు కోలుకుంటున్నారని ఆయన సోదరి మీడియాకు తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకొని త్వరలోనే మన ముందుకు వస్తారని ఆమె అన్నారు. మరోవైపు ఆస్పత్రి వర్గాలు సైతం శరత్ బాబు చికిత్సకు స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపాయి.
![]() |
![]() |