![]() |
![]() |

ఇటీవల 'మాస్ కా ధమ్కీ' సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 'గామి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అందులో హీరోయిన్ గా నటిస్తున్న చాందిని చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న 'గామి' చిత్రానికి విద్యాధర్ దర్శకుడు. నిజానికి 2021 లోనే ఈ చిత్ర ప్రకటన వచ్చింది. అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. చాలా కాలం పాటు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చింది చాందిని చౌదరి. 'గామి' చిత్రీకరణ పూర్తయిందని ట్వీట్ చేసిన చాందిని.. ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రపంచానికి చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.
షూటింగ్ పూర్తయింది కాబట్టి, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని.. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. మరి ఈ చిత్రంతో విశ్వక్ సేన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |