![]() |
![]() |

ఎం ఎం కీరవాణి... ఈయన ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామోజీరావు సంస్థ అయిన ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చిన 'మనసు మమత' ద్వారా ఈయన సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కూడా ఈయన ఉషా కిరణ్ మూవీస్ లో ఎన్నో చిత్రాలు చేశారు. ఈయనకు బాగా గుర్తింపును తీసుకొని వచ్చిన చిత్రం మాత్రం క్రాంతి కుమార్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన కళాఖండం 'సీతారామయ్యగారి మనవరాలు' అని చెప్పాలి. ఆ తరువాత 'క్షణక్షణం' చిత్రంతో ఆయన మరో స్థాయికి చేరారు. ఇక రాఘవేంద్రరావు దర్శకునిగా మెగాస్టార్ చిరంజీవితో ఈయన పని చేసిన 'ఘరానా మొగుడు' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సాధారణంగా కొందరు సంగీత దర్శకులు బిజిఎం బాగా అందిస్తారని మరికొందరు మెలోడీ లని మరికొందరు మాస్ అని ఇలా కేటగిరీలుగా విభజించుకుంటారు. కానీ కీరవాణిలో ఇవి అన్ని కలిసి ఇమిడి ఉన్నాయి. ఆయన అందించే సంగీతం.. సంగీత వాయిద్యాల హోరు లేకుండా సాహిత్యం వినబడేలా ఉంటుంది. ఈయన మాస్ సాంగ్స్ చేసినా కూడా తనదైన మెలోడీ మార్కులు చూపిస్తారు. తెలుగు, తమిళ ,హిందీ భాషలకు 100 చిత్రాలకు పైగానే సంగీతాన్ని అందించారు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయస్థాయి అవార్డును అందుకున్నారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 25 చిత్రాలకు పైగా సంగీతం వహించారు. ఒకరకంగా ఈయన రాఘవేంద్రరావు, రాజమౌళిలకు ఆస్థాన సంగీత దర్శకుడు. ఈయన కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాలు అంటే ఆయన సంగీతం అందించిన ప్రతి చిత్రాన్ని చెప్పుకోవచ్చు. మచ్చుకి సీతారామయ్యగారి మనవరాలు, క్షణక్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, స్టూడెంట్ నెంబర్ వన్, చత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, మిస్టర్ పెళ్ళాం, పెళ్లి సందడి, సుందరాకాండ వంటి ఎన్నో చిత్రాలు అని చెప్పుకోవచ్చు. ఈయన రాఘవేంద్రరావు నుంచి క్రిష్ వరకు బాపు నుంచి విశ్వనాధ్ వరకు ఎందరో చిత్రాలకు పనిచేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈయన కంటెంట్ నచ్చిన చిత్రాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో కీరవాణి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ రకంగా ఇప్పుడు ఆయన టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన స్వరపరిచిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అంతేకాదు, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కి కూడా నామినేట్ అయింది. ఈ ఆనందంలో ఉండగానే తాజాగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆయనకు పద్మశ్రీ లభించింది. ఇలా వరుస పురస్కారాలతో ఆయన పేరు మారుమోగిపోతోంది. ఇదే ఊపులో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభిస్తే ఈ ఏడాది కీరవాణి నామ సంవత్సరం అవుతుందేమో!.
![]() |
![]() |