భారతీయ చిత్ర పరిశ్రమలో వీర జవాన్ల కథలతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో సింహభాగం విజయపథంలో పయనించాయి. ఇక రీసెంట్ గా విడుదలైన తెలుగు చిత్రం 'మేజర్' కూడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. కట్ చేస్తే.. త్వరలో ఇద్దరు స్టార్ కిడ్స్ సోల్జర్స్ గా తెరపై సందడి చేయనున్నారు. కేవలం వారం వ్యవధిలో ఆ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవ్వడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రం `సీతా రామం`. హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామాలో.. లెప్టెనెంట్ రామ్ గా దర్శనమివ్వనున్నాడు దుల్కర్ సల్మాన్. ఆగస్టు 5న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమైంది. ఇక `సీతా రామం` విడుదలైన వారం లోపే అంటే ఆగస్టు 11న 'లాల్ సింగ్ చద్ధా' తెరపైకి వస్తోంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన ఈ హిందీ సినిమాలో కింగ్ నాగార్జున తనయుడు, యువ సామ్రాట్ నాగచైతన్య ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో తనది కూడా సైనికుడి పాత్రే.
మరి.. వారం వ్యవధిలో సోల్జర్స్ గా పలకరించబోతున్న స్టార్ కిడ్స్ దుల్కర్, చైతూ.. ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.