Home  »  News  »  Purushaha Movie Review: 'పురుషః' మూవీ రివ్యూ

Updated : May 22, 2026

నటీనటులు: పవన్ కళ్యాణ్, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, పమ్మి సాయి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, గ్యాబి రాక్, రాజీవ్ కనకాల, అనంత్ శ్రీరామ్ తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
డీఓపీ: సతీష్ ముత్యాల
నిర్మాత: బత్తుల కోటేశ్వరరావు
రచన - దర్శకత్వం: వీరు ఉలవల
విడుదల తేదీ: మే 22, 2026 

టాలీవుడ్‌లో భార్య బాధితుల కాన్సెప్ట్‌తో వచ్చే వినోదాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చాలా కాలం తర్వాత, ఇదే తరహా హిలేరియస్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'పురుషః'. ఫన్నీ ప్రోమోలతో కామెడీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. నేడు(మే 22) థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఏ మేరకు నవ్వించిందో రివ్యూలో తెలుసుకుందాం. (Purushaha Review)

కథ:
గోవింద్ అలియాస్ బండ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు అలియాస్ బొగ్గు (సప్తగిరి), శ్రీను అలియాస్ జంప్ (రాజ్ కుమార్ కసిరెడ్డి) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. గోవింద్- కమల (రాయంచ) లది ప్రేమ పెళ్లి కాగా.. సత్తిబాబు- లక్ష్మి (హాసిని), శ్రీను- గీత (విషిక)లది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయిన కొంతకాలానికే ఈ ముగ్గురూ తమ భార్యలతో గొడవలు పడుతూ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురూ కలిసి తమ మరో చిన్ననాటి మిత్రుడు కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు. అక్కడ కిస్సు రాసుకున్న పర్సనల్ డైరీలో ఈ ముగ్గురి గురించి ఉన్న కొన్ని విషయాలు చదివి వీళ్ళ భార్యలు షాకవుతారు. ఆ తర్వాత ఈ ముగ్గురి భార్యలు తమకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కుతారు. ఇంతకీ ఆ డైరీలో ఏముంది? ఈ ముగ్గురు స్నేహితులు తమ భార్యల నుంచి విడాకులు కాకుండా కాపాడుకోగలిగారా లేదా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మగాళ్లు.. పెళ్లి.. ఆ తర్వాత భార్యలతో వచ్చే గొడవలు.. ఈ కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఎఫ్‌ 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. ఇదే భార్య బాధితుల కాన్సెప్ట్‌ను కాస్త నవ్వులు జోడించి సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నమే ఈ 'పురుషః'.

ఈ సినిమా, పెళ్లైన ప్రతి మగాడి జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబించేలా సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సగటు భర్త బయోపిక్ అని చెప్పవచ్చు. అయితే పెళ్లి తర్వాత పురుషులు ఎదుర్కొనే అవస్థలను చూపిస్తూనే, సంసారంలో భార్యల ప్రాముఖ్యత ఏంటి అనే మంచి పాయింట్‌తో దర్శకుడు వీరు ఉలవల ఈ కథను రాసుకున్నాడు. 

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లయిన మగాళ్ల కష్టాలు, భార్యలతో వచ్చే గొడవలు, వెన్నెల కిషోర్ పెళ్లి హంగామాతో చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ బ్లాక్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ 'కిటికీ' ఎపిసోడ్ సినిమాకే హైలైట్.

సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా కోర్టు డ్రామా వైపు మళ్లుతుంది. ఇక్కడే కామెడీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది. కోర్టు సీన్లు రొటీన్ ఫార్మాట్‌లో సాగుతాయి. డైరీలో ఉన్న కొన్ని చిన్న చిన్న విషయాలకే భార్యలు అంత పెద్దగా రియాక్ట్ అయి విడాకుల వరకు వెళ్లడం కూడా కాస్త అతిగా అనిపిస్తుంది. అయితే మధ్యలో పమ్మి సాయిపై వచ్చే 'హౌస్ హస్బెండ్' కాన్సెప్ట్ సీన్ నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉంటుంది. 

ఈ రోజుల్లో ఆర్గానిక్ కామెడీ క్రియేట్ చేసి థియేటర్లలో నవ్వులు పూయించడం పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి టైంలో 'పురుషః' మూవీ ప్రేక్షకులకు బాగానే గిలిగింతలు పెడుతుంది. ప్రధాన పాత్రధారులు ముగ్గురిని సూపర్ హీరోలుగా చూపిస్తూ డిజైన్ చేసిన కామెడీ కొంత మేర పండింది. పాత సినిమాల ఛాయలు కనిపించినా.. భార్యల వల్ల భర్తలు పడే కష్టాల మీదున్న కామెడీ ట్రాక్స్ బాగానే నడిచాయి. కథలో కొత్తదనం లేకపోయినా.. కామెడీతో కాలక్షేపం చేయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

దర్శకుడు క్లైమాక్స్‌కు ముందు ఒక మంచి ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు పాత సినిమాలు గుర్తొచ్చినా, సినిమా ముగింపును మాత్రం ఫీల్ గుడ్‌గా డిజైన్ చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ బత్తుల, తన మొదటి సినిమాకే చక్కని నటన కనబరిచాడు. కామెడీతో పాటు ఎమోషన్ ను బాగా పండించాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వెన్నెల కిషోర్ మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లో నవ్వుల పూయించాడు. రాయంచ, హాసిని, విషిక, పమ్మి సాయి తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

దర్శకుడు వీరు ఉలవల.. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన భార్యబాధితుల కథను తీసుకుని.. ఇప్పటి ట్రెండుకు తగ్గ కామెడీతో బాగానే నడిపించారు. క్యారెక్టర్లను, కామెడీ సిచువేషన్లను డిజైన్ చేసిన తీరు మెప్పించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఎడిటర్ కోటి సెకండాఫ్‌లో కొన్ని సీన్లను క్రిస్ప్‌గా కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి 'పురుషః' సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.