Home  »  News  »  ఐదేళ్ల నాటి ట్వీట్ చిచ్చు.. తీవ్రమైన లీగల్ ఇబ్బందుల్లో ప్రముఖ నటులు!

Updated : May 22, 2026

సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఒక్కోసారి ఎంతటి వివాదాలకు దారితీస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇద్దరు టాప్ సెలబ్రిటీలు గతంలో చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు వారిని చట్టపరమైన సమస్యల్లోకి నెట్టింది. ప్రముఖ బెంగాలీ నటులు పరంబ్రత ఛటర్జీ, స్వస్తిక ముఖర్జీలపై పోలీసులకు ఫిర్యాదు అందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి హింసాత్మక ఘటనలకు ఈ నటుల వ్యాఖ్యలే కారణమంటూ కోల్‌కతాలోని గరియాహట్ పోలీస్ స్టేషన్‌లో జాయ్‌దీప్ సేన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2021 నాటి సున్నితమైన పరిస్థితుల్లో ఈ ఇద్దరు తారలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారని, అందుకే వారిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫిర్యాదుదారు పేర్కొన్న వివరాల ప్రకారం.. 2021 మే 2న బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున నటుడు పరంబ్రత ఛటర్జీ బెంగాలీ భాషలో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు. "ఈ రోజును ప్రత్యర్థులను చితకబాదే ప్రపంచ దినోత్సవంగా ప్రకటిద్దాం" అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయగా, దానికి నటి స్వస్తిక ముఖర్జీ నవ్వుతున్న ఎమోజీని జత చేస్తూ ‘అలాగే జరగనివ్వు’ అంటూ మద్దతుగా రిప్లై ఇచ్చారు. ఈ వ్యాఖ్యలే అక్కడ తీవ్ర హింసకు దారితీశాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ట్వీట్లు వచ్చిన కొద్దిసేపటికే బేలియాఘాట ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారని, ఆ సమయంలో జరిగిన అనేక దాడులకు ఈ సెలబ్రిటీల పోస్టులే కారణమని ఫిర్యాదులో వెల్లడించారు. పరంబ్రత ఛటర్జీ కేవలం బెంగాలీ చిత్రాల్లోనే కాకుండా హిందీలో విద్యాబాలన్ ‘కహానీ’, అనుష్క శర్మ ‘పరీ’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే స్వస్తిక ముఖర్జీ కూడా పలు పాపులర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి కావడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఈ ఐదేళ్ల నాటి పాత ట్వీట్ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో, సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం తగదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లీగల్ నోటీసులు మరియు పోలీస్ కంప్లైంట్‌పై నటుడు పరంబ్రత కానీ, నటి స్వస్తిక కానీ ఎలాంటి వివరణ ఇస్తారో.. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.