Home  »  News  »  Manchu Manoj: పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్ సంచలన ప్రకటన!

Updated : May 19, 2026

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manoj Manchu) ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే..

‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే.

‘ఐక్య’ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది? నియమాలు ఏంటి?
‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు. మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం.

‘ఐక్య’కి ఇతర వివరాల్ని ఎప్పుడు ప్రకటిస్తారు?
జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్’ చిత్రం ఉంటుంది. అందులో నేను డీసీపీగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అంతలోపు ‘ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను.

మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? కథల ఎంపికలో పూర్తి నిర్ణయం మీదేనా?
నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్ కనకమేడల గారికి, కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ప్రతీ స్క్రిప్ట్, కథని నేనే విన్నాను. నేనే ఓకే చేశాను. ఇప్పుడు కూడా నేనే వింటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ, ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను గానీ వెళ్లం. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటాం.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు?
మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు.

మే 20 అంటే ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టిన రోజు కూడా కదా..?
నా పుట్టిన రోజుని తారక్ అన్నతో, స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. సిరివెన్నెల గారికి అంతం అంటూ ఉండదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు.

‘డేవిడ్ రెడ్డి’ ఎలా ఉండబోతోంది?
నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పేకంటే రేపు (మే 20) సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది. మాటల కంటే మన పని చెబితేనే బెటర్. షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. హనుమా రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఈ మధ్యే షూటింగ్ చేసి వచ్చాం. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు.

‘వాట్ ది ఫిష్’ పరిస్థితి ఏంటి?
‘వాట్ ది ఫిష్’ ఇప్పుడు రావడం లేదు. అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. నేను, సత్య, వెన్నెల కిషోర్ అందరం కలిసి చేయాల్సిన సినిమా. చివరి నిమిషంలో చాలా మందికి వీసా ప్రాబ్లం వచ్చింది. స్క్రిప్ట్ బాగుంది. మిగిలిన అన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.

‘మోహన రాగ మ్యూజిక్’ పనులు ఎక్కడి వరకు వచ్చాయి?
‘మోహన రాగ మ్యూజిక్’ చాలా బాగా వస్తుంది. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సింగర్లు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పాటలు రికార్డ్ అయ్యాయి. మరో నాలుగు పాటలు రెడీ కావాల్సి ఉంది. ఇంకో రెండు, మూడు నెలల సమయం పట్టేలా ఉంది.

‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి చెప్పండి?
మౌనిక గారు ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు. త్వరలోనే బెంగళూరులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆమెకు నేను జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్‌లు ఈ నెలలోనే వస్తాయి. ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.