![]() |
![]() |

కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న థియేటర్లలోకి రాబోతోంది. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల కానుంది.
'జన నాయగన్' అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ 'జననాయగన్' మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం భారతీయ మార్కెట్ నుంచే ఈ చిత్రం రూ. 24 కోట్లకు పైగా అడ్వాన్స్ గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ బుకింగ్స్ రూ. 16 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాయి.
ముఖ్యంగా తమిళనాడులో విజయ్ మాస్ ఇమేజ్ మరోసారి రుజువైంది. తమిళనాడులో మాత్రమే ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు రూ. 13 కోట్లు రావడం విశేషం. అనూహ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరు అడ్వాన్స్ బుకింగ్స్‌లో నగరాల పరంగా రూ. 6.66 కోట్లతో టాప్ లో నిలిచింది.
ఈ సినిమాకు ప్రధాన కేంద్రాలలోని థియేటర్లలో విపరీతమైన రష్ కనిపిస్తోంది. చెన్నై నగరంలో ఊహించని రీతిలో 90.3% అక్యుపెన్సీ నమోదు కాగా, కోయంబత్తూరులో ఏకంగా 96% అక్యుపెన్సీతో దాదాపు అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.
సినిమా విడుదలకు ముందు అనేక వివాదాలు, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, సుదీర్ఘమైన వాయిదాలు, పైరసీ అయినప్పటికీ అభిమానుల ఉత్సాహం కొంచెం కూడా తగ్గకపోవడం విశేషం. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.
పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన 'జననాయగన్' జూలై 23న థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
Jana Nayagan, Advance Bookings, Thalapathy Vijay, Jana Nayakudu
![]() |
![]() |