Home  »  News  »  ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ సంచలన నిర్ణయం.. విజయ్ కి పోటీ తప్పదా!

Updated : Aug 11, 2026

 

కరుడుగట్టిన సినీ అభిమానులు కొలువు తీరి ఉన్న రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు అని చెప్పవచ్చు. అభిమానాన్ని చూపించుకునే క్రమంలో ఇండియా వైడ్ గా   పోటీ పెట్టిన తమిళనాడుకి చెందిన ఫ్యాన్స్ నే గెలిచే పరిస్థితి. అంతటి డై హార్ట్ ఫ్యాన్స్ తమ హీరో సినిమా రిలీజ్ ఉన్నా లేకపోయినా సినీ మార్కెట్ లో తచ్చాడుతూ ఉంటారు.     

స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల 'ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్'  కోయంబత్తూర్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా సంక్షేమ సంఘాలని బలోపేతం చేయడంతో పాటు నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. ముఖ్యంగా కోయంబత్తూర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను రెండు ప్రధాన భాగాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గంలో నూతన కమిటీలను నియమించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.  ఆగస్టు 8వ తేదీన ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ బి. రాజా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వి. సుబ్రహ్మణ్య శివ సంతకాలతో కూడిన అధికారిక సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఈ సర్క్యులర్ ప్రకారం, కోయంబత్తూర్ జిల్లాలోని మొదటి విభాగంలో కోయంబత్తూర్ సౌత్, తొండముత్తూర్, కిణత్తుక్కడవు, పొల్లాచి, వాల్పరై అనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, రెండో విభాగంలో కోయంబత్తూర్ నార్త్, కౌండంపాలయం, సింగనల్లూర్, సులూర్, మెట్టుపాలయం అనే 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోని ధనుష్ అభిమానులందరూ ప్రత్యేక సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కోయంబత్తూర్ జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా, ఇదే తరహా నియోజకవర్గాల వారీ నెట్‌వర్క్ విస్తరణను తమిళనాడులోని మిగిలిన జిల్లాలకు కూడా వర్తింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  ఈ పరిణామాల వెనుక ధనుష్ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు, నిర్వహించిన భారీ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 

జూలై 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, "మనమందరం ఒకే చోట కూడటంలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ ఐక్యతకు ఒక సరైన ప్రయోజనాన్ని, లక్ష్యాన్ని ఇవ్వాలి. కేవలం సినిమా ఆడియో లాంచ్‌లు, థియేటర్ సెలబ్రేషన్లకే పరిమితం కాకుండా మీ ప్రాంతంలోని పేద ప్రజల అవసరాలను గుర్తించి, సహాయం చేయండి" అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, అదే వేదికపై ఫ్యాన్ క్లబ్ నూతన పతాకాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం విశేషం. దానికి తోడు, ఆగస్టు 4న చెన్నై సాలిగ్రామంలో తాను చదువుకున్న థాయ్ సత్య మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల నూతన భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చారు. దానికి 'ధనుష్ బ్లాక్' అని నామకరణం చేసి, తన పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.  సాధారణంగా తమిళనాడులో సినీ తారల ఫ్యాన్స్ క్లబ్‌లు కేవలం అభిమాన సంఘాలుగానే కాక, క్షేత్రస్థాయి రాజకీయ నెట్‌వర్క్‌లుగా మారడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. 

ఇటీవల విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించడానికి ముందు కూడా తన 'విజయ్ మక్కల్ ఇయక్కం' ద్వారా నియోజకవర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, గ్రాస్‌రూట్ స్థాయి నెట్‌వర్క్ నిర్మించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే శైలిలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, ధనుష్ వర్గం మాత్రం ఇది కేవలం సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు మరియు సభ్యత్వ నమోదు డ్రైవ్‌లు చూస్తుంటే ధనుష్ భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.  మరోవైపు రాజకీయ ఊహాగానాలు షికారు చేస్తున్నప్పటికీ, ధనుష్ తన సినీ కెరీర్‌పై కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు.

Also Read: 72 పాటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ సినిమా

ధనుష్  ప్రస్తుతం  రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'ఓమ్: చాప్టర్ 1' (Om: Chapter 1) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తమిళ సినీ రంగానికి, రాజకీయాలకు ఉన్న అనుబంధం అయితే మాత్రం దశాబ్దాల నాటిది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్ , కమల్ హాసన్, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 

Dhanush, Vijay, Om






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.