![]() |
![]() |
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, విలక్షణ నటనకు మారుపేరైన చియాన్ విక్రమ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'చియాన్ 63' షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే విక్రమ్, ఈసారి మునుపెన్నడూ చూడని సరికొత్త డిఫరెంట్ రోల్‌తో మన ముందుకు రాబోతున్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవర్, ప్యాషన్‌తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నాడు షురూ అయినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
గతంలో విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'ఫస్ట్ ఫ్లేమ్' గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రంలో విక్రమ్ ఒక 'డేంజరస్ కుక్' పాత్రలో కనిపిస్తుండటం విశేషం. "లోపల ఉన్నది కేవలం ఒక వంటవాడే.. కానీ అతడిని తక్కువ అంచనా వేయొద్దు" అంటూ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌లోకి నటి రియా షిబు కూడా చేరినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ఎంతో ఆరాధించే నలుగురు విభిన్న దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లు విక్రమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రేజీ లైనప్‌లో ఆనంద్ శంకర్ ప్రాజెక్ట్ ఒకటి కావడం గమనార్హం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఇంకొక్కడు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'చియాన్ 63' షూటింగ్ అప్డేట్ ట్రెండ్ అవుతోంది. విక్రమ్ మళ్లీ తన మార్క్ నటనతో, సరికొత్త మేకోవర్‌తో థియేటర్లలో రచ్చ లేపడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
![]() |
![]() |