సినిమా పేరు: మేమ్ ఫేమస్
తారాగణం: సుమంత్ ప్రభాస్, సార్య లక్ష్మణ్, మౌర్య నలగట్ల, మణి ఎగుర్ల, సిరి రాశి, కిరణ్ మచ్చా, అంజి మామ, మురళీధర్ గౌడ్, శివ నందన్
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్ డైరెక్టర్: అరవింద్ ములి
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్స్: ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్
విడుదల తేదీ: మే 26, 2023
ఈమధ్య కాలంలో ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ ని హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తూ ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాపై విడుదలకు ముందు బాగానే బజ్ క్రియేట్ అయింది. పైగా 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత యువ నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నుంచి వస్తున్న సినిమా కావడం కూడా ఆసక్తిని కలిగించింది. మరి కొత్తవారితో వారు చేసిన ప్రయత్నం ఫలించి, హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారా?...
కథ:
బందనర్సంపల్లికి చెందిన మహేష్(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఎగుర్ల), బాలి(మౌర్య నలగట్ల) ముగ్గురూ ప్రాణస్నేహితులు. వారికి ఊరే ప్రపంచం. అయితే బాధ్యత లేకుండా, ఏ పని చేయకుండా జులాయిల్లా తిరుగుతూ గొడవలు, కొట్లాటలతో కాలం వెళ్లదీసే వీరిపట్ల ఇంట్లో వారికి, ఊళ్ళో వారికి సదాభిప్రాయం ఉండదు. పైగా ఇందులో ఇద్దరికి ప్రేమ కథలు కూడా ఉంటాయి. మహేష్ తన మేనమామ ఎల్లారెడ్డి(మురళీధర్ ) కూతురు మౌనిక(సార్య లక్ష్మణ్)ను ప్రేమిస్తే, బాలి తన చిన్ననాటి స్నేహితురాలు బబ్బీ(సిరి రాశి)ని ప్రేమిస్తాడు. మేనల్లుడు మహేష్ కనీసం తన కూతురితో మాట్లాడటానికి కూడా మేనమామ ఇష్టపడడు. ఇక బాలి-బబ్బీ కి వారి ప్రేమ గురించి ఇంట్లో చెప్పే ధైర్యంలేదు. మహేష్, దుర్గ, బాలి ఎన్ని వేషాలు వేసినా మౌనిక, బబ్బీతో పాటు ఆ ఊరి సర్పంచ్ వేణు(కిరణ్ మచ్చా) వారికి అండగా నిలుస్తాడు. అయితే ఆ ముగ్గురి ఆకతాయితనం శృతిమించి, ఒకానొక సమయంలో వారి తల్లిదండ్రులు ఊరందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. దీంతో సర్పంచ్ వేణు వారిని గట్టిగా మందలించి.. బాధ్యతలు గుర్తు చేస్తాడు. అప్పటి నుంచి లైఫ్ ని కాస్త సీరియస్ గా తీసుకున్న మహేష్, దుర్గ, బాలి.. ముగ్గురూ కలిసి అయినవాళ్ల సాయంతో డబ్బులు పోగేసి 'ఫేమస్ టెంట్ హౌస్' ను స్టార్ట్ చేస్తారు. వ్యాపారం బాగానే నడుస్తుంది, ఇప్పుడిప్పుడే జీవితంలో నిదొక్కుకుంటున్నారు అనుకునే సమయంలో.. అనుకోకుండా టెంట్ హౌస్ కాలిపోయి, ఊహించని నష్టాలు, కష్టాలు వెంటాడుతాయి. వాటి నుంచి బయటపడటానికి వాళ్ళు ఏం చేశారు? ప్రాణ స్నేహితులు మహేష్, దుర్గ కష్టాలలో ఉంటే వారిని వదిలి బాలి సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మహేష్, బాలి ప్రేమకథలు గెలుపు తీరాలకు చేరాయా? అనేది మిగతా కథ.
చిన్న సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావడం కష్టం. కంటెంట్ అద్భుతంగా ఉందనే టాక్ వస్తే తప్ప కలెక్షన్లు రావు. 'మేమ్ ఫేమస్' కోసం పలువురు సెలబ్రిటీలను రంగంలోకి దింపి ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. దానివల్ల ఓపెనింగ్స్ అంతోఇంతో చెప్పుకునే స్థాయిలో వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే సినిమా చూశాక ప్రమోషన్స్ మీద పెట్టినంత శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టలేదు అనిపిస్తుంది. పక్క ఊరి వాళ్లతో జరిగే క్రికెట్ మ్యాచ్ లో మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఆ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి మరీ ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆ సన్నివేశాల్లో ఆశించిన స్థాయిలో ఫన్ జనరేట్ కాకపోవడంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యేలా ఉంటుంది. ఆ తర్వాత హీరోకి టెంట్ హౌస్ పెట్టాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు సన్నివేశాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. వారు టెంట్ హౌస్ పెడతామంటే అయినవాళ్లు వారికి తోచిన సాయం చేస్తూ అండగా నిలిచే సన్నివేశాలు మెప్పిస్తాయి.
సినిమా నెమ్మదిగా ప్రారంభమైనా, ఇంటర్వెల్ కి ముందు కాస్త మెరుగ్గా ఉందనిపించుకుంటుంది. కానీ ద్వితీయార్థం పూర్తిగా గాడి తప్పింది. యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకోవడం, వీడియోలు చిత్రీకరించడం అనేది సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించదు. ఒకానొక సమయంలో బిగ్ స్క్రీన్ మీద యూట్యూబ్ కంటెంట్ చూస్తున్నామనే భావన కలుగుతుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా కాస్త కామెడీ వర్కౌట్ అయినా, అది సినిమాని నిలబెట్టే స్థాయిలో లేదు. సినిమాని ముగించిన తీరు కూడా మెప్పించదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సినిమా సాగి, సింపుల్ గా ముగుస్తుంది. కథలో కొత్తదనం, కథనంలో మలుపులు లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ తోనో, ఎమోషన్స్ తోనో ప్రేక్షకులను కూర్చోబెట్టగలగాలి. 'మేమ్ ఫేమస్' ఆ విషయంలో ఫెయిల్ అయింది.
సుమంత్ ప్రభాస్ కి ఈ సినిమాతో మొదట రచయితగా, దర్శకుడిగా అవకాశమొచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా హీరో అయ్యాడు. అయితే అతను నటుడిగా మంచి మార్కులే వేయించుకోగలిగాడు కానీ.. రచయితగా, దర్శకుడిగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమాలో ఏ విభాగం కూడా అద్భుతం అనుకునేలా చేయలేదు. ఉన్నంతలో శ్యామ్ దూపాటి కెమెరా పనితనం బాగానే ఉంది. పల్లె వాతావరణాన్ని తన కెమెరాలో చక్కగా బంధించాడు. కళ్యాణ్ నాయక్ సంగీతం పరవాలేదు. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సృజన అడుసుమిల్లి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. పరిచయ సన్నివేశాలు, ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసుంటే అవుట్ పుట్ కాస్త మెరుగ్గా ఉండేదేమో. నిర్మాతలు సినిమాకు అవసరమైన మేరకు ఎక్కడా పరిధి దాటి వెళ్లకుండా ఖర్చు పెట్టారని అర్థమవుతుంది.
నటీనటుల పనితీరు:
హీరోగా సుమంత్ ప్రభాస్ కి మొదటి సినిమా అయినప్పటికీ బాగానే రాణించాడు. ఊరిలో ఉండే మధ్యతరగతి యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఓ వైపు స్నేహితులు, ఎంతో ఇష్టమైన ఊరు.. మరోవైపు ప్రేమ, ఇష్టంలేని పని మధ్య నలిగిపోయే యువకుడు బాలిగా మౌర్య నలగట్ల ఆకట్టుకున్నాడు. హాస్యం, ఆకతాయితనం, ఆవేశం కలగలిసిన దుర్గ పాత్రలో మణి ఎగుర్ల మెప్పించాడు. లిప్ స్టిక్ స్పాయిలర్ గా సందడి చేసిన శివ నందన్ అనే పిల్లోడు ఉన్నంతలో బాగానే నవ్వించాడు. సినిమాలో అతని కామెడీ కాస్త రిలీఫ్. మహేష్ మేనమామగా మురళీధర్, మహేష్ ప్రేయసిగా సార్య లక్ష్మణ్, బాలి ప్రేయసిగా సిరి రాశి, గ్రామ సర్పంచ్ గా కిరణ్ మచ్చా, అంజి మామ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ప్రమోషన్స్ లో వినిపించిన సౌండ్, సినిమాలో కనిపించలేదు. బిగ్ స్క్రీన్ మీద యూట్యూబ్ కంటెంట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా మెప్పించే కొన్ని హాస్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కోసం.. ఎందరో కొత్తవారు కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి చూడొచ్చు.
-గంగసాని