English | Telugu

నాలుగో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ హీరోయిన్‌?

పెళ్ళంటే నూరేళ్ళ పంట అనేది నానుడి. కానీ, సినిమా రంగంలో కొందరికి మాత్రం అది మంటగా పరిణమిస్తూ ఉంటుంది. నటీనటులు పెళ్ళి చేసుకోవడం, కొన్నాళ్ళకు విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ సర్వసాధారణం. ముఖ్యంగా పెళ్ళయిన మగాళ్ళను పెళ్లి చేసుకోవడం అనేది పరిశ్రమలో ఎంతో సహజమైన ప్రక్రియ. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. సినిమా మొదలైన నాటి నుంచీ ఉంది. అయితే అదిప్పుడు ఉద్ధృతంగా మారిందని చెప్పాలి. గత కొన్నేళ్ళుగా సహజీవనం అనే మాట వింటున్నాం. అలాగే పెళ్ళయిన కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంటున్న వారినీ చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో రెండుకు మించి వివాహాలు చేసుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి వనిత విజయ్‌కుమార్‌ చేరబోతోంది అనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

విజయ్‌కుమార్‌, మంజుల దంపతులకు వనిత, శ్రీదేవి, ప్రీతి, అరుణ్‌ విజయ్‌ సంతానం. వీరిలో వనిత తప్ప మిగతా వారు పెళ్లి చేసుకొని సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో ఉన్నారు. కానీ, వనిత మాత్రం పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ అస్థిరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ వివాహం 1969లో ముత్తుకన్నుతో జరిగింది. ఆ తర్వాత 1976లో నటి మంజులను వివాహం చేసుకున్నారు. మంజుల 2013లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వనిత విషయానికి వస్తే.. నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందన్న వార్త వినిపిస్తోంది. 2000లో ఆకాష్‌ను వివాహం చేసుకున్న వనిత 2007లో అతని నుంచి విడాకులు తీసుకుంది. 2007లో ఆనంద్‌ జయరాజన్‌ను పెళ్లి చేసుకుంది. అది కూడా బెడిసి కొట్టడంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2020 జూన్‌లో ఇద్దరు పిల్లల తండ్రైన ఫోటోగ్రాఫర్‌ పీటర్‌ పాల్‌ను వివాహం చేసుకుంది. హనీమూన్‌ రోజు నుంచే వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయి. కేవలం నాలుగు నెలలు మాత్రమే వీరి బంధం కొనసాగింది. సెప్టెంబర్‌లో ఇద్దరూ విడిపోయారు. 

ఇప్పుడు వనిత నాలుగో పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. పీటర్‌ పాల్‌ని పెళ్ళి చేసుకోక ముందు 8 సంవత్సరాల వైవాహిక జీవితానికి దూరంగా ఉంది వనిత. ఆ గ్యాప్‌లో తమిళ్‌ కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌తో ప్రేమాయణం నడిపిందని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, పీటర్‌ పాల్‌ని పెళ్లి చేసుకొని అందరికీ షాక్‌ ఇచ్చింది వనిత. పీటర్‌ నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు రాబర్ట్‌ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందని సమాచారం. ఇదే నిజమైతే ఇది వనిత చేసుకోబోతున్న నాలుగో పెళ్ళి అవుతుంది.