'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని జూన్ 29 న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది, ప్రమోషన్స్ కి సమయం లేకపోవడంతో సినిమాని వాయిదా వేస్తే మంచిదనే ఆలోచనలో నిఖిల్ ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 29 నే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ గందరగోళం నడుమ ఈ మూవీకి సంబంధించి ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది.
'స్పై'లో ఓ పాన్ ఇండియా హీరో స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఆయనెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిఖిల్ ఇటీవల 'ది ఇండియా హౌస్' అనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆ సినిమా మొదలవ్వడానికి ముందే నిఖిల్ 'స్పై' సినిమాకి తన వంతు సపోర్ట్ చేయడానికి చరణ్ ముందుకొచ్చారట. 'స్పై' సినిమాలో చరణ్ కొద్ది నిమిషాల పాటు కనిపించే ఓ చిన్న అతిథి పాత్రలో మెరవనున్నారట. 'ఆర్ఆర్ఆర్'తో చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాడో తెలిసిందే. మరోవైపు నిఖిల్ కూడా 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా 'స్పై' టీజర్ ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. ఇప్పుడు చరణ్ రూపంలో అదనపు ఆకర్షణ తోడైతే 'స్పై' సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి అనడంలో సందేహం లేదు. కాగా ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలోనూ ఓ సాంగ్ చరణ్ మెరిశారు.