చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా.. నరసింహారెడ్డి' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఆ సినిమాకు పలువురు రచయితలు.. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, భూపతి రాజా, బుర్రా సాయిమాధవ్, మధు.. ఇంతమంది పనిచేశారు. 'సైరా' చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్. అందుకే దానికి ఎంత చేయగలరో అంత చేశారు ఆ రైటర్స్ అందరూ. సైరాతో చిరంజీవి పెద్ద సాహసమే చేశారు. 65 సంవత్సరాల వయసులో శారీరకంగా, మానసికంగా అంత కష్టపడ్డం చిన్న విషయం కాదు.
'మాయదారి మల్లిగాడు' సినిమా తర్వాత సత్యానంద్‌కు అందరు హీరోల సినిమాలకూ పనిచేసే అవకాశం వచ్చింది. కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అందరి సినిమాలకూ పనిచేశారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య.. మూడు తరాలకూ, నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. మూడు తరాలకూ, ఘట్టమనేని కుటుంబంలో కృష్ణ, మహేశ్‌బాబు సినిమాలకు పనిచేశారు.
ఆమధ్య బాలకృష్ణను కలిస్తే, ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను పిలిచి, "ఈయన తాతయ్యగారికి రాసిన కవిగారు. దణ్ణం పెట్టు" అన్నారు. ఆ కుర్రాడు దణ్ణం పెడితే సత్యానంద్ అన్నారు, "మోక్షకు కూడా ఎప్పుడో ఒకప్పుడు రాయాలి" అని. ఇటీవల ఆయన తను పనిచేసిన సినిమాలనోసారి చూసుకుంటే, 83 మంది డైరెక్టర్లతో పనిచేసినట్లు తేలింది.