ఒక భాష నుంచి మరో భాషలోకి రీమేక్ చేసే అలవాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకే కాదు, హాలీవుడ్‌కూ ఉంది! నిజం చెప్పాలంటే విదేశీ సినిమాల్ని రీమేక్ చెయ్యడం హాలీవుడ్‌కు ఒక వ్యసనంగా మారింది. చాలా సార్లు ఆ రీమేక్స్ బెడిసికొట్టాయి. ఉదాహరణకి స్పైక్‌లీ తీసిన ‘ఓల్డ్ బాయ్’, రూపర్ట్ శాండర్స్ డైరెక్ట్ చేసిన ‘ఘోస్ట్ ఇన్ ద షెల్’ వంటివి. బయటి దేశాల్లో మాస్టర్‌పీస్‌లుగా పేరుపొందిన వాటిని రీమేక్ చెయ్యడంలో ఎన్ని సార్లు ఫెయిలైనా హాలీవుడ్ డైరెక్టర్లు పదే పదే రీమేక్స్ తీస్తూనే ఉన్నారు. అయితే అలా రీమేక్ చేసిన వాటిలోనూ ఘన విజయాలు సాధించిన సినిమాలూ ఉన్నాయి. వాటిలో టాప్ టెన్ సినిమాలేవో చూద్దాం…
1. కోల్డ్ పర్సూట్ (2018): హన్స్ పెట్టర్ మోలండ్ రూపొందించిన ‘ఇన్ ఆర్డర్ ఆఫ్ డిజప్పియరెన్స్’ (2014)కు ఇది రీమేక్. ఈ రీమేక్‌తోటే ఒరిజినల్ డైరెక్టర్ మోలండ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం గమనార్హం. లియాం నీసన్, టాం బేట్‌మన్, లారా డెర్న్, ఎమ్మీ రోసుం, అలెక్స్ పానోవిక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒకే దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలు రెండూ గొప్పగా పేరు సంపాదించుకున్నాయి.
2. ద బర్డ్‌కేజ్ (1996): ఇది ఎడౌర్డ్ మొలినరో రూపొందించిన ఇటాలియన్ కామెడీ ఫిల్మ్ ‘లా కేజ్ ఆక్స్ ఫోలెస్’కు రీమేక్. రాబిన్ విలియమ్స్, నాథన్ లేన్, జీన్ హాక్‌మన్, డయానే వీస్ట్, డాన్ ఫట్టర్‌మన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మైక్ నికోల్స్. ఎల్‌జీబీటీ కేరెక్టర్లతో ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
3. ద కిండర్‌గార్టెన్ టీచర్ (2018): నడవ్ లాపిడ్ రూపొందించిన ఇజ్రాయెలీ డ్రామా మూవీ ‘ద కిండర్‌గార్టెన్ టీచర్’ (2014)కు ఇది రీమేక్. సారా కొలాంజిలో డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మేగీ గిలెన్‌హాల్, పార్కర్ సెవాక్, మైఖెల్ చెర్నస్, గేల్ గార్సియా బెర్నాల్ ప్రధాన పాత్రధారులు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సాధించిన ఈ సినిమా థియేటర్‌లలో కంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ ఆదరణ పొందింది.
4. ద డిపార్టెడ్ (2006): ఆండ్రూ లవ్, అలన్ మాక్ సంయుక్తంగా రూపొందించిన హాకాంగ్ క్రైం మిస్టరీ ఫిల్మ్ ‘ఇంటర్నల్ ఎఫైర్స్’కు ఇది రీమేక్. మార్టిన్స్ స్కోర్సీస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లియొనార్డో డికాప్రియో, మాట్ డామన్, జాక్ నికల్సన్, మార్క్ వాల్‌బర్గ్, మార్టిన్ షీన్ ప్రధాన పాత్రధారులు. హాలీవుడ్ రీమేక్ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ‘ద డిపార్టెడ్’ బెస్ట్ పిక్చర్‌గా ఆస్కార్‌ను సైతం గెలుచుకుంది.
5. ద మాగ్నిఫిసెంట్ సెవెన్ (2016): విఖ్యాత దర్శకుడు అకిర కురసోవా రూపొందించిన చేసిన మహోన్నత జపనీస్ యాక్షన్ మూవీ ‘సెవెన్ సమురాయ్’ (1954)కి ఇది రీమేక్. ఆంటోయిన్ ఫుఖ్వా డైరెక్ట్ చేసిన ‘ద మాగ్నిఫిసెంట్ సెవెన్’లో డెంజిల్ వాషింగ్‌టన్, క్రిస్ ప్రాట్, ఎథన్ హాక్, బ్యుంగ్-హున్ లీ, విన్సెస్ట్ డి ఓనోఫ్రియో, మాన్యుయెల్ గర్సియా-రుల్ఫో, మార్టిన్ సెన్‌స్మీయర్ టైటిల్ రోల్స్ చేశారు. ఒరిజినల్‌తో పోలిస్తే ఏమాత్రం సరితూగకపోయినా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది.
6. హచి: ఎ డాగ్స్ టేల్ (2009): సీజిరో కోయమ డైరెక్ట్ చేసిన జపనీస్ ఫిల్మ్ ‘హచికో మొనొగటరి’ (1987) సినిమాకి ఇది రీమేక్. లాసే హాల్‌స్ట్రాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రిచర్డ్ గెరె, జోవన్ అలెన్, సారా రోమర్, లేలా (డాగ్) ప్రధాన పాత్రధారులు. విమర్శకులు అంతగా మెచ్చని ఈ సినిమాని ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.
7. లెట్ మి ఇన్ (2010): టోమస్ ఆల్ఫ్రెడ్‌సన్ డైరెక్ట్ చేసిన స్వీడిష్ హారర్ ఫిల్మ్ ‘లెట్ ద రైట్ ఒన్ ఇన్’ (2008)కు ఇది రీమేక్. మాట్ రీవ్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొడి స్మిట్-మెక్‌ఫీ, క్లో గ్రేస్ మోరెట్జ్, రిచర్డ్ జెంకిన్స్, ఇలియాస్ కోటియాస్ ప్రధాన పాత్రలు చేశారు. హాలీవుడ్‌లో రూపొందిన గొప్ప వాంపైర్ సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది.
8. సమ్ లైక్ ఇట్ హాట్ (1959): మార్లిన్ మన్రో పోషించిన ఐకనిక్ రోల్స్‌లో ఒకటిగా పరిగణించే రోల్ చేసిన ఈ సినిమాని బిల్లీ వైల్డర్ రూపొందించాడు. కర్ట్ హాఫ్‌మన్ డైరెక్ట్ చేసిన వెస్ట్ జర్మన్ ఫిల్మ్ ‘ఫ్యాన్‌ఫేర్స్ ఆఫ్ లవ్’ (1951)కి రీమేక్ అయిన ‘సం లైక్ ఇట్ హాట్’లో మార్లిన్ మన్రో, టోనీ కర్టిస్, జాక్ లెమన్, జార్జ్ రాఫ్ట్, ప్యాట్ ఓ’బ్రియాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కాలానికి ఎదురు నిలిచి క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది.
9. ద రింగ్ (2002): ఇది హిదియో నకటా డైరెక్ట్ చేసిన జపనీస్ ఫిల్మ్ ‘రింగ్’ (1998)కు రీమేక్. గోర్ వెర్బెన్‌స్కీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ మూవీలో నవోమీ వాట్స్, మార్టిన్ హెండర్సన్, డేవిడ్ డోర్ఫ్‌మన్, బ్రియాన్ కాక్స్, జేన్ అలెగ్జాండర్ ప్రధాన పాత్రధారులు. ఒరిజినల్, సీక్వెల్ రెండూ ఆల్ టైం బెస్ట్ హారర్ మూవీస్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.
10. ద సెంట్ ఆఫ్ ఎ వుమన్ (1992): ఇది 1974లో వచ్చిన డినో రిసి డైరెక్ట్ చేసిన 103 నిమిషాల ఇటాలియన్ సినిమా ‘ద సెంట్ ఆఫ్ ఎ వుమన్’కు రీమేక్. 156 నిమిషాల నిడివితో మార్టిన్ బ్రెస్ట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్ పాసినో, క్రిస్ ఓ డన్నెల్, జేమ్స్ రెభార్న్, గాబ్రియెల్లే అన్వర్ ప్రధాన పాత్రలు పోషించారు.