ఒక సినిమా షూటింగ్ సజావుగా జరగాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మధ్య సమన్వయం ఎంతో అవసరం. మంచి ఔట్పుట్ రావడం కోసం ఒక్కోసారి ఆర్టిస్టుల మధ్య, టెక్నీషియన్స్ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. అయితే అది సినిమా వరకే పరిమితం అవుతుంది తప్ప వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడం చాలా అరుదు. కానీ, కొన్ని ఘటనలు మాత్రం కళాకారుల మధ్య దూరాన్ని పెంచేస్తాయి. అలాంటి ఓ అరుదైన వివాదం, వాగ్వాదం దర్శకరత్న దాసరి నారాయణరావు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు మధ్య జరిగింది. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. కృష్ణంరాజుని దాసరి ‘అబ్బాయ్’ అని పిలుస్తారు, దాసరిని కృష్ణంరాజు ‘నారాయణరావుగారు’ అని పిలుస్తారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అయితే ‘సీతారాములు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య ఓ అగాధం ఏర్పడింది. దాని పర్యవసానంగా ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.
ఒక చిన్న విషయంలో ఇద్దరూ విభేదించుకున్నారు. మాటా మాటా పెరిగింది. కృష్ణంరాజుతో సినిమా చెయ్యనని దాసరి, దాసరితో సినిమా చెయ్యనని కృష్ణంరాజు భీష్మించుకు కూర్చున్నారు. ఈ గొడవ తారాస్థాయికి వెళ్ళడానికి వీరిద్దరి వెనుక వున్న మనుషులే కారణం. ఇదిలా ఉంటే.. ‘సీతారాములు’ సినిమా సెట్స్‌పై ఉండగానే కృష్ణంరాజు హీరోగా దాసరి దర్శకత్వంలోనే ‘బండోడు గుండమ్మ’ చిత్రం మరుసటి రోజు ప్రారంభం కావాల్సి ఉంది. అదే వేడిలో ఆ సినిమా నిర్మాత జి.వి.ఎస్.రాజును పిలిచి ‘మనం కృష్ణంరాజుతో కాకుండా వేరే హీరోతో చేద్దామండీ’ అన్నారు దాసరి. ‘నేను కూడా ఆ సినిమా చేయడం లేదు’ అన్నారు కృష్ణంరాజు. వీరిద్దరి మధ్య ఆ నిర్మాత నలిగిపోయారు. అప్పటికే ‘బండోడు గుండమ్మ’ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఇన్విటేషన్స్ అందరికీ పంచారు.
కృష్ణంరాజుని కాదని చిన్న హీరోతో సినిమా చేసినా, వాయిదా వేసినా తన లెవల్ తగ్గుతుందని భావించిన దాసరి ఓ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు హనుమంతరావుకి జరిగిన విషయం అంతా వివరించి తను చేయబోతున్న సినిమా గురించి చెప్పారు. కృష్ణను సంప్రదించి ఏ విషయం చెప్పమన్నారు దాసరి. చివరికి సినిమా చేయడానికి కృష్ణ ఒప్పుకున్నారు. మరుసటిరోజు సినిమా ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. అక్కడ మేకప్ వేసుకొని కూర్చున్న కృష్ణను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ సినిమాలో హీరో కృష్ణంరాజు అయితే కృష్ణ ఎందుకు ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. మొత్తానికి సినిమా ప్రారంభోత్సవం అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తన ‘సీతారాములు’ సినిమా పరిస్థితి ఏమిటి అనేది నిర్మాత జయకృష్ణకు అర్థం కాలేదు. దాదాపు నాలుగు నెలలు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. నిర్మాత జయకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ సినిమా పూర్తి చేసేందుకు దాసరి, కృష్ణంరాజు ఒప్పుకున్నారు.
‘సీతారాములు’ చిత్రంలోని ‘తొలి సంధ్య వేళలో.. తొలిపొద్దు పొడుపులో..’ అనే సాంగ్‌ని కన్యాకుమారిలో తియ్యాలని దాసరి ప్లాన్ చేశారు. సూర్యోదయం సమయంలోనే ఆ పాట తియ్యాలి. అంతకుముందు రోజు రాత్రి దాసరి, కృష్ణంరాజు ఒకే ఫ్లైట్‌లో విడి విడిగా కూర్చొని వచ్చారు. కానీ, ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరి దారిన వారు హోటల్‌కి చేరుకున్నారు. మరుసటి రోజు యూనిట్ అంతా తెల్లవారుజామున 4 గంటలకు లొకేషన్‌కి చేరుకుంది. మొదట దాసరి వచ్చి కూర్చున్నారు. తర్వాత కాసేపటికి కృష్ణంరాజు వచ్చారు. ఇంతకాలం తర్వాత ఎదురుపడుతున్న ఇద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని యూనిట్‌లోని వారంతా ఎదురుచూస్తున్నారు. కృష్ణంరాజు వస్తున్న సంగతి శిష్యులు దాసరి చెవిన వేశారు. దానికాయన ‘వస్తే రానీ.. ఏం నేను లేచి అతనికి స్వాగతం పలకాలా’ అని గట్టిగా అన్నారు. కూర్చొని ఉన్న దాసరిని చూసి ‘గుడ్‌మార్నింగ్ నారాయణరావుగారూ’ అని ఎంతో కూల్‌గా పలకరించారు కృష్ణంరాజు. దాసరి రియాక్షన్ ఎలా ఉంటుందా అని యూనిట్‌లోని అందరూ ఎంతో టెన్షన్‌తో చూస్తున్నారు. ఒక్కసారిగా కూర్చీలో నుంచి పైకి లేచి ‘అబ్బాయ్.. ఎలా ఉన్నావ్’ అని కృష్ణంరాజుని కౌగిలించుకున్నారు. అలా వారిద్దరి మధ్య రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరికి సుఖాంతమైంది. ఆ తర్వాత దాసరి నారాయణరావు, కృష్ణంరాజు కాంబినేషన్లో ఓ అరడజను సినిమాలు వచ్చాయి.