Home  »  Featured Articles  »  అవమానాన్ని కూడా ఆనందంగా అక్కున చేర్చుకున్న అక్కినేని!

Updated : Feb 27, 2026


పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారంతా ఒకప్ప్పుడు ఎన్నో కష్టాలకోర్చినవారు, మరెన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ తరహా కష్టాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్, ఎఎన్నార్.. తెలుగు సినిమాకి రెండు కళ్లులాంటివారు అని చెబుతారు. ఎందుకంటే వారు చేసిన సినిమాల ద్వారా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకొచ్చారు. నటుడిగా ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. 1944లో వచ్చిన ‘సీతారామ జననం’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు ఎఎన్నార్. 1949లో వచ్చిన ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ చిత్ర రంగ ప్రవేశం చేశారు. 

ఒక విధంగా చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యారని చెప్పొచ్చు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాలను భరించారు. అలాంటి ఓ ఘటన 1946లో వచ్చిన ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం చేస్తున్న సమయంలో జరిగింది. ఎఎన్నార్‌ను ఆ సినిమా మేనేజర్ సూర్యనారాయణ తీవ్రంగా అవమానించాడు. ఆ తర్వాత అక్కినేని హీరోగా ఎలా ఎదిగారో, ఎలాంటి మరపురాని సినిమాలు చేశారో మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే 1967లో పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ప్రాణమిత్రులు’ చిత్రంలో నటిస్తున్నారు అక్కినేని. అప్పటికి ఎఎన్నార్ స్టార్ హీరో. ఈ సినిమాకి కూడా సూర్యనారాయణే మేనేజర్.

ఒకరోజు అక్కినేని చెయ్యాల్సిన సీన్‌కు అంతా సిద్ధం కావడంతో షాట్ రెడీ చెప్పి రమ్మని సూర్యనారాయణకు చెప్పారు పుల్లయ్య. మేకప్ రూమ్ దగ్గరకు వెళ్లిన ఆయన ఎఎన్నార్‌ను చూస్తూ వినయంగా నిలబడ్డారు. అది గమనించిన అక్కినేని.. ‘సూర్యనారాయణగారు.. చెప్పండి’ అన్నారు. ‘డైరెక్టర్‌గారు షాట్ రెడీ అని మీకు చెప్పమన్నారు’ అన్నాడు. ‘ఓకే. వస్తాను’ అని అంటూ ‘సూర్యనారాయణగారూ.. మీరు ముగ్గురు మరాఠీలు సినిమాకి పనిచేశారు కదూ. 20 సంవత్సరాలు దాటిపోయినా నేను మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. మీ వల్ల నాకు జరిగిన అవమానం అలాంటిది. 

కన్నాంబగారు, సుబ్బారావుగారు మేకప్ రూమ్‌లో భోజనం చేస్తున్నారు. వారితోపాటు ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు. నేను కూడా అక్కడికి వచ్చాను. నన్ను చూసి మీరు కసురుకున్నారు. ‘ఇక్కడ పెద్దవాళ్లంతా భోజనం చేస్తున్నారు. నీకు ఇక్కడేం పని. క్యాంటిన్‌కి వెళ్లు’ అన్నారు మీరు. నేను బాధపడుతూనే క్యాంటిన్‌కి వెళ్లిపోయాను’ అంటూ పాత విషయాన్ని గుర్తు చేశారు అక్కినేని. 

అది విని ఆ మేనేజర్ కంగారుపడిపోయాడు. ‘పొరపాటు జరిగిపోయింది సార్‌’ అన్నాడు. ‘ఇప్ప్పుడు మిమ్మల్ని తిట్టాలని ఆ విషయం గుర్తు చెయ్యలేదు. ఆరోజు మీరు చేసింది కరెక్టే. అప్ప్పుడు నేను సాధారణ నటుడ్ని. వాళ్లు పెద్ద నటులు. కాబట్టే మీరు అలా ప్రవర్తించారు. ఆరోజు నేను దాన్ని అవమానంగా భావించాను. ఎంతో బాధపడ్డాను కూడా. అది మీకు తెలియాలని ఇప్ప్పుడు గుర్తు చేశాను తప్ప మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’ అంటూ సూర్యనారాయణ భుజం తట్టి సెట్ వైపు అడుగులు వేశారు అక్కినేని. 

ప్రారంభదశలో జరిగిన ఇలాంటి అవమానాలకు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగారు కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు మహానటుడుగా ఎదిగారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని తనను అవమానించిన వ్యక్తిపై పగ సాధించకుండా ప్రేమతోనే అతని మనసును గెలుచుకున్నారు. ఇలాంటి ఎన్నో అవమానాలను అక్కున చేర్చుకొని తన విజయ సోపానానికి మెట్లుగా మార్చుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.