ఏ నటుడైనా హీరోగా పరిచయమైన తర్వాత హీరోగానే నటించాలని అనుకుంటాడు. సెకండ్ హీరోగా అవకాశం వచ్చినా, ఎంతో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లభించినా చేసేందుకు ఇష్టపడరు. కానీ, చంద్రమోహన్ అలా కాదు. తను చేసే క్యారెక్టర్ చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఆయనకు తెలుసు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా దానికి న్యాయం చేయడం తన బాధ్యత అని చెప్పేవారు చంద్రమోహన్. రంగుల రాట్నం చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన బాల్యం గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం.
1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు చంద్రమోహన్. అతని పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. పమిడిముక్కల, అచ్చంపేటలలో టెన్త్ వరకు చదివారు. ఆ తర్వాత అగ్రికల్చర్ మీద ఉన్న ఆసక్తితో బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్‌సి. పూర్తి చేశారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే గుంటూరు, బాపట్లలో నాటకాలు వేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే సమయం చిక్కినప్పుడల్లా నాటకాలు వేసేవారు. 1964లో అంతా కొత్తవారితో తేనెమనసులు చిత్రం నిర్మిస్తున్నామని, ఉత్సాహం ఉన్న కళాకారులు ఫోటోలు పంపించాలని పేపర్‌లో ప్రకటన వచ్చింది. అది చూసిన చంద్రమోహన్ ఫోటోలు పంపించారు. తర్వాత కొన్నాళ్ళకు ఆడిషన్ కోసం మద్రాస్ రావాల్సిందిగా కబురు వచ్చింది. ఆ ఆడిషన్‌కు హాజరయ్యారు. కానీ, సెలెక్ట్ అవ్వలేదు. వెంటనే ఏలూరు తిరిగి వచ్చేశారు. అదే సమయంలో చంద్రమోహన్ తండ్రి మరణించారు. ఇక అప్పటి నుంచి తల్లి అతన్ని ఎక్కడికీ వెళ్ళనివ్వలేదు. సినిమా ప్రయత్నాలు చెయ్యవద్దని, అక్కడికి వెళితే చెడిపోతావని చెప్పారు. చక్కగా ఉద్యోగం చేస్తూ ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత నీదేనని గుర్తు చేశారు. అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు చెయ్యలేదు.
ఇదిలా ఉంటే.. తేనెమనసులు కోసం చంద్రమోహన్ పంపిన ఫోటోలను దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి చూసి ఆడిషన్ కోసం మద్రాస్ రావాల్సిందిగా కబురు చేశారు. కానీ, చంద్రమోహన్ వెళ్ళలేదు. యితే ఆడిషన్‌కి వచ్చిన వారి ఫోటోలను మరో దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి చూసి ఆడిషన్‌కి రావాల్సిందిగా చంద్రమోహన్‌కు ఉత్తరం. కానీ, ఆయన వెళ్ళలేదు. ఆ తర్వాత బి.ఎన్.రెడ్డి విజయవాడ వచ్చినపుడు తనని కలవమని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఆయన్ని కలిశారు చంద్రమోహన్. అప్పుడు అతనికి ఫిజికల్ ఆడిషన్ చేశారు. స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రమ్మని చెప్పారు. అయితే ఆదివారం అయితేనే వస్తానని చెప్పారు చంద్రమోహన్. ఆ తర్వాత తల్లిని ఒప్పించి మద్రాస్ వెళ్ళారు. చిత్ర పరిశ్రమకు చెందిన మహామహులు ఆడిషన్‌కి వచ్చిన వారికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఏ విషయం తర్వాత చెప్తామని అనడంతో ఏలూరు వచ్చేశారు చంద్రమోహన్. నెల రోజుల తర్వాత తాము నిర్మిస్తున్న రంగులరాట్నం చిత్రంలో హీరోగా సెలెక్ట్ అయినట్టు వాహిని సంస్థ నుంచి లెటర్ వచ్చింది. అది చూసిన చంద్రమోహన్‌కి సంతోషంతోపాటు భయం కూడా పట్టుకుంది. ఓ పక్క జాబ్ పోతుందేమోనన భయం, మరో పక్క తల్లిని ఎలా ఒప్పించాలి అనే సందిగ్ధంలో పడిపోయారు. కావాలంటే ఒక నెలరోజులు మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చని, జాబ్ ఎక్కడికీ పోదని అతని కొలీగ్స్ సలహా ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి తన తల్లిని ఎలా ఒప్పించాలి అనేది పెద్ద సమస్యగా మారింది. విషయం తల్లికి చెప్పగానే ఆమె ఒప్పుకోలేదు. ఎంతో ప్రాధేయపడిన తర్వాత కొన్ని షరతులు పెట్టి ఆమె ఒప్పుకున్నారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లవద్దని మరీ మరీ చెప్పి పంపించారు.
మద్రాస్ చేరుకున్న చంద్రమోహన్ సరాసరి వాహిని స్టూడియోకి వెళ్లారు. నెలరోజులపాటు షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయో గమనించమని బి.ఎన్.రెడ్డి చెప్పారు. తను పెట్టిన సెలవులు చాలా తక్కువ. షూటింగ్ చూసేందుకే అన్ని రోజులూ అయిపోతే ఇక సినిమా ఎప్పుడు తీస్తారు అనే సందేహం చంద్రమోహన్‌కి వచ్చింది. అయినప్పటికీ బి.ఎన్.రెడ్డి చెప్పిన సమయానికే షూటింగ్ ప్రారంభించి షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేశారు. 1966లో రంగులరాట్నం విడుదలై మంచి విజయం సాధించింది. మొదటి సినిమా అయినప్పటికీ తన సహజమైన నటనతో, స్పష్టమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు చంద్రమోహన్. అంతేకాదు, ఈ సినిమా చూసిన ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు కూడా అతని నటనను మెచ్చుకున్నారు. రంగుల రాట్నం తర్వాత బాపు డైరెక్షన్‌లో బంగారు పిచిక, ఐ.ఎన్.మూర్తి డైరెక్షన్‌లో సుఖదు:ఖాలు వంటి ఎన్నో సినిమాల్లో చంద్రమోహన్‌కి అవకాశాలు వచ్చాయి. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్ షిఫ్ట్ అయిపోయారు. హీరోగానే కాకుండా, సెకండ్ హీరోగా, సహాయనటుడిగా ఏ పాత్ర వచ్చినా చేసేవారు. అలా అందరు హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కాలం మారింది సినిమాలో నటించారు. ఆ సమయంలోనే విశ్వనాథ్ తనకు అన్నయ్య అవుతారన్న విషయం తెలిసింది. అప్పటి నుంచి వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. విశ్వనాథ్ డైరెక్షన్‌లో చాలా సినిమాల్లో నటించారు చంద్రమోహన్.
చంద్రమోహన్ భార్య పేరు జలంధర. ఆమె రచయిత్రి. ఆమె రచించిన కథలు, సంకలనాలు, నవలలు 50 వరకు ఉంటాయి. వీరికి ఇద్దరు కుమార్తెలు. చంద్రమోహన్‌ది లక్కీ హ్యాండ్ అనే పేరు ఉండేది. ఎందుకంటే ఆయన సరసన నటించిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు టాప్ పొజిషన్‌కి వెళ్లిపోయారు. జయప్రద భూమికోసం సినిమాతో నటిగా పరిచయమైనప్పటికీ అంతులేని కథ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, చంద్రమోహన్‌తో కలిసి సిరిసిరిమువ్వ చిత్రంలో నటించిన తర్వాతే ఆమె హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. వీరిద్దరూ కలిసి 6 సినిమాల్లో నటించారు. ఇక జయసుధ పండండి కాపురం సినిమాలో మొదటిసారి నటించి ఆ తర్వాత చంద్రమోహన్‌తో సెక్రటరి చిత్రంలో జతకట్టిన తర్వాత ఆమె కూడా బిజీ అయిపోయారు. వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో నటించారు. పదహారేళ్ళ వయసు చిత్రంలో ఆయన సరసన నటించిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్‌గా ఏ రేంజ్‌కి వెళ్లిపోయిందో అందరికీ తెలిసిందే. శ్రీరంగనీతులు చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించారు. ఈ సినిమా తర్వాతే విజయశాంతికి పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి 8 సినిమాల్లో నటించారు. అప్పట్లో టాలీవుడ్‌కి ఏ హీరోయిన్ వచ్చినా తమ మొదటి సినిమా చంద్రమోహన్‌తోనే ఉండాలని కోరుకునేవారు. హీరో శోభన్‌బాబు, చంద్రమోహన్ మంచి మిత్రులు. శోభన్‌బాబు ఏ ప్రాపర్టీ కొన్నా చంద్రమోహన్ దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బును అడ్వాన్స్ ఇచ్చేవారు. అది తనకు బాగా కలిసి వస్తుందని శోభన్‌బాబు బాగా నమ్మేవారు.
50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోగా, సెకండ్ హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 900కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. అందులో హీరోగా చేసిన సినిమాలు 175. రంగులరాట్నంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణానికి చనిపోయే వరకు ఎక్కడా బ్రేక్ పడలేదు. చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అనేది చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. అతనికి ఉన్న టాలెంట్‌కి పెద్ద స్టార్ హీరో అయిపోవచ్చు. కానీ, అతని హైట్ వల్ల అది సాధ్యపడలేదు. ఒక్క అడుగు ఎక్కువ ఉంటే ఇండస్ట్రీని ఏలేవాడు అని సినీ ప్రముఖులే చెప్పేవారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు హైట్ అనేది తప్పనిసరి. అలాంటి ఎన్నో పాత్రలు అతను పొట్టిగా ఉండడం వల్ల చేజారిపోయాయి. అయినా ఈ విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడేవారు కాదు. తనకు ఏది ప్రాప్తం ఉంటే అదే వస్తుంది అనేవారు. దానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేవారు. ఆయన నటించిన చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్. అనారోగ్య కారణాల వల్ల ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రమోహన్‌ను 2023 నవంబర్‌లో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ నవంబర్ 11న తుదిశ్వాస విడిచారు చంద్రమోహన్.