సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, టెక్నీషియన్స్‌గా టాప్ పొజిషన్‌కి వెళ్ళిన వారంతా ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. తొలి రోజుల్లో అష్టకష్టాలు పడినవాళ్ళే. అయితే ఒక దశకు చేరిన తర్వాత పాత విషయాలన్నీ మర్చిపోయి ఎదుటివారిని చులకన భావంతో చూస్తుంటారు. ఇండస్ట్రీలో మనతో ఉండేవాడే కదా అనే ఆలోచన కూడా లేకుండా వారిని మానసిక వ్యధకు గురి చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఆర్థిక లావాదేవీల వల్లే ఏర్పడతాయని చాలాసార్లు రుజువైంది. తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయిన నిర్మాతతో ఇల్లు రాయించుకున్న హీరోలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే నిర్మాతలతో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించి నష్టాల్లోకి నెట్టిన డైరెక్టర్లూ ఉన్నారు. కారణం ఏదైనా ఇండస్ట్రీలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ విషాద ఘటన డైరెక్టర్ తేజ జీవితంలో జరిగింది. ఒక నిర్మాత చేసిన మోసం వల్ల తన నాలుగేళ్ళ కొడుకుని కోల్పోయారు తేజ. దానికి సంబంధించిన వివరాలను కొన్ని సంవత్సరాల క్రితం ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా తెలియజేశారు తేజ.
‘మా అబ్బాయి చనిపోవడానికి కారణం ఫైనాన్షియర్ కూడా అయిన ఒక నిర్మాత. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాప, ఇద్దరు బాబులు. ముగ్గురిలో చిన్నవాడు పుట్టినపుడు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్లు చేసిన తప్పు వల్ల బాబు హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. ట్రీట్మెంట్ కోసం జర్మనీ, చైనా వంటి దేశాలకు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య వల్ల కొన్నాళ్ళు సినిమాలు చెయ్యలేదు. అప్పటికి ఆ నిర్మాతకు నేను కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. సినిమాలు చేస్తే మీ డబ్బు ఇవ్వడం నాకు కష్టం కాదు. ఇప్పుడు మా అబ్బాయి హెల్త్ కండిషన్ బాగా లేదు కాబట్టి సినిమాలు చేయలేకపోతున్నాను. నన్నేం చెయ్యమంటారు అని అడిగాను. ‘ఇల్లు నాకు తాకట్టు పెట్టండి డబ్బు ఇస్తాను’ అన్నారు. అయితే మీకు ఇవ్వాల్సిన డబ్బు కాకుండా నాకు ఇంకా కావాలి అని అడిగాను. అప్పుడు మా ఇల్లు మూడు కోట్లకు జిపిఎ చేయించాము. ఆ నిర్మాత మనుషులు వచ్చి నేను ఇవ్వాల్సిన కోటి రూపాయలు మినహాయించి మిగతా రెండు కోట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. నేను, నా వైఫ్ సాక్షి సంతకాలు పెట్టాం. ఈలోగా ఆ నిర్మాత నుంచి ఫోన్ రావడంతో ‘మీకు ఇవ్వాల్సిన డబ్బు ఆయనే ఇస్తారట’ అంటూ తెచ్చిన డబ్బు లోపల పెట్టేసుకున్నారు. ఇప్పటివరకు ఆ డబ్బు ఇవ్వలేదు. పైగా ఇల్లు టేకోవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఇది ఒక రకమైన చీటింగ్. మేం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ రాయలేం. నాకు దీని మీద సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల అలా జరిగింది.
ఆ సమయంలో మా అబ్బాయికి గొంతులోకి ఒక పైప్ పెట్టారు. కడుపులోకి ఒక పైప్ పెట్టారు. తప్పనిసరిగా ట్రీట్మెంట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు మరో ఇల్లు అమ్మి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతో జర్మనీ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాం. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అదే టైమ్‌లో నామీద కేసు పెట్టారు. అది చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఆ టెన్షన్లో మా అబ్బాయిని చూసుకోలేకపోయాను. ఫలితంగా బాబు చనిపోయాడు. అప్పటికి బాబు వయసు నాలుగేళ్ళు. కేవలం ఆ నిర్మాత వల్లే బాబు చనిపోయాడు. అంత ధనదాహం దేనికి. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం నా హిస్టరీలోనే లేదు. ఇంకా చెప్పాలంటే.. ఇండస్ట్రీలోనే నాకు కోట్లు రావాల్సినవి ఉన్నాయి. మొదట్లో మూడు సినిమాలు డైరెక్ట్ చేశాను. ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. అందుకే సొంతంగా సినిమాలు తియ్యాలని చిత్రం మూవీస్ బేనర్ స్టార్ట్ చేశాను. మొదటి సినిమాగా ‘జయం’ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు మా యూనిట్లో పనిచేసిన వారిలో ఆడపిల్లలు ఉన్నవారికి ఒక్కో ఫ్లాట్ కొనిచ్చాను. అలా 12 ఫ్లాట్స్ ఇచ్చాను. డబ్బు అనేది అవసరం కోసమే తప్ప నాకు ధన దాహం లేదు అని చెప్పడానికే ఇదంతా చెబుతున్నాను. నా లివింగ్ స్టైల్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంజాయ్ చెయ్యడానికి ఎక్కడికీ వెళ్లను. ఇంట్లోనే ఉంటా. టీవీ కూడా చూడను. ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను. నా జీవితంలో ఎక్కువ బాధ పడింది మా అబ్బాయి చనిపోయినపుడే. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొస్తుంది’ అంటూ తన లైఫ్‌లో జరిగిన ట్రాజెడీ ఇన్సిడెంట్ గురించి తెలిపారు డైరెక్టర్ తేజ.