ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చే కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ఈ జానర్ లో వెంకీ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో 'వసంతం' సినిమా ఒకటి. ఆడ, మగ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించగా, స్నేహితురాలి పాత్రలో కళ్యాణి దర్శనమిచ్చింది. ఆకాశ్, సునీల్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, ఆహుతి ప్రసాద్, కొండవలస, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్బీ శ్రీరామ్, ప్రసాద్ బాబు, సూర్య, వైజాగ్ ప్రసాద్, శివారెడ్డి, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అతిథి పాత్రలో మెరిశారు. 'సూర్యవంశం' మాతృక దర్శకుడైన విక్రమన్.. తెలుగులో నేరుగా రూపొందించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
కథాంశం విషయానికి వస్తే.. అశోక్ (వెంకటేశ్), జూలీ (కళ్యాణి) చిన్నప్పట్నుంచి స్నేహితులు. క్రికెటర్ గా రాణించాలన్నది అశోక్ కల. జూలీ కూడా ఆ విషయంలో ఎంతగానో ప్రోత్సహిస్తుంటుంది. ఇదే సమయంలో అశోక్ జీవితంలోకి నందిని (ఆర్తి అగర్వాల్) వస్తుంది. తొలుత అశోక్, జూలీ స్నేహాన్ని ఇబ్బందిగా ఫీలైనా.. క్రమంగా అర్థం చేసుకుంటుంది నందిని. మరోవైపు.. మైఖేల్ (ఆకాశ్)తో ప్రేమలో పడుతుంది జూలీ. వారిద్దరి పెళ్ళి కోసం.. మైఖేల్ పెట్టిన షరతు కారణంగా జూలీకి దూరమవుతాడు అశోక్. కొన్ని సంఘటనల తరువాత భారతీయ జట్టు తరపున క్రికెట్ ఆడి గెలవడమే కాకుండా.. జూలీ స్నేహాన్ని కూడా మళ్ళీ గెలుచుకుంటాడు అశోక్. అలాగే కాలక్రమంలో అశోక్, జూలీ పిల్లలు సైతం స్నేహితులవుతారు.
మెలోడీ స్పెషలిస్ట్ ఎస్.ఎ. రాజ్ కుమార్ బాణీలు కట్టిన 'వసంతం'కి వేటూరి సుందరరామ్మూర్తి, 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, చంద్రబోస్, కులశేఖర్ సాహిత్యమందించారు. "గాలి చిరుగాలి", "అమ్మో అమ్మాయేనా", "నిను చూడక", "జాంపండువే", "గోదారల్లే పొంగే", "ఓ జాబిలి", "ఓ లాలీ పాప్ కి".. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఎస్. నాగ అశోక్ కుమార్ నిర్మించిన 'వసంతం'.. స్పెషల్ జ్యూరీ (ఎన్వీ ప్రసాద్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (పి. రాంబాబు) విభాగాల్లో 'నంది' పురస్కారాలు దక్కించుకుంది. అంతేకాదు.. 'సింహాద్రి' వంటి సెన్సేషనల్ మూవీ విడుదలైన రెండు రోజుల తరువాత వచ్చిన 'వసంతం'.. 139 కేంద్రాలలో 50 రోజులు, 71 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై అప్పట్లో వార్తల్లో నిలిచింది. 2003 జూలై 11న విడుదలై ఘనవిజయం సాధించిన 'వసంతం'.. మంగళవారంతో 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది.