సావిత్రి మహానటి. ఎంతటి మహానటో అంతటి దయాశీలి. అంతేకాదు, ఆమెలో చక్కని దర్శకురాలు కూడా ఉంది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన 'చిన్నారి పాపలు' చిత్రం విడుదలై జూన్ 21కి 55 యేళ్లు నిండుతున్నాయి. ఇదే రోజు 1968లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో అప్పటి గొప్ప నటీనటులు చాలామంది నటించారు. వారిలో జగ్గయ్య, సావిత్రి, షావుకారు జానకి, జమున, ఎస్వీ రంగారావు, పద్మనాభం, శాంతకుమారి, రేలంగి, సూర్యకాంతం, రమణారెడ్డి, రమాప్రభ లాంటి వాళ్లున్నారు. రోజారమణి బాలనటిగా ఇందులో కనిపించింది.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో 1967 అక్టోబర్ 12న చిత్రీకరించారు. హీరోయిన్ కాస్ట్యూమ్స్ సహా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సావిత్రి చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి తానే నిర్మాతనన్నట్లు వ్యవహరించారు. ఎందుకంటే నిర్మాణ సంస్థ శ్రీ మాతా ఫిలిమ్స్‌లో 14 మంది భాగస్వాములు ఉన్నారు. అందరూ పెద్దమనుషుల భార్యలు. వాళ్లందరూ పెట్టుబడి పెట్టినా సినిమా పూర్తి కాని స్థితి. దాంతో కొంతమంది ఫైనాన్షియర్స్‌ను తీసుకొచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందు దాని పనులన్నింటినీ తన భుజాల మీద వేసుకున్న సావిత్రి తన సొంత డబ్బుల్ని చాలావరకు వెచ్చించారు. ఈ సినిమా నిర్మాణంలో భర్త జెమినీ గణేశన్ నుంచి ఆమెకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ముహూర్తపు షాట్‌కు మాత్రం క్లాప్ కొట్టారు.
1968 జూన్ 21న విడుదలైన 'చిన్నారి పాపలు' సినిమా పెట్టుబడిలో పావు వంతు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఫైనాషియర్స్ వచ్చి కూర్చున్నారు. నిర్మాణ సంస్థలోని షేర్ హోల్డర్స్ అందరూ ముఖాలు చాటేశారు. లాభం లేదనుకొని తన దగ్గర ఉన్న క్యాష్‌తో పాటు నగలు అమ్మగా వచ్చిన డబ్బును ఫైనాన్షియర్స్‌కు ఇవ్వాల్సింది ఇచ్చేశారు సావిత్రి. అయితే ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలుచుకోవడం ఒకింత ఊరట. సావిత్రి దర్శకురాలిగా మంచి ప్రతిభ చూపించింది అనే పేరు తెచ్చుకున్నారు.
అలనాటి అద్భుత గాయని పి. లీల ఈ సినిమాతో సంగీత దర్శకురాలిగా మారడం మరో విశేషం. పర్యవేక్షకునిగా ఎస్పీ కోదండపాణి వ్యవహరించారు. పాటలను కొసరాజు, ఆరుద్ర, సినారె, వి. సరోజిని రాశారు. శేఖర్-సింగ్ సినిమాటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి ఎంఎస్ఎన్ మూర్తి ఎడిటర్‌గా పనిచేశారు. నిర్మాతగా వ్యవహరించిన వీరమాచనేని సరోజిని.. రమణతో కలిసి సంభాషణలు రాయడమే కాకుండా ఒక పాటనూ రాశారు.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇదే సినిమాను శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జెమిని గణేశన్ హీరోగా 'కుళందై ఉళ్లం' టైటిల్‌తో మళ్లీ తీశారు సావిత్రి. దానికి కూడా తెలుగు సినిమాకు పట్టిన గతే పట్టింది.