పెద్ద కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతే, ఒకవైపు ఆమె కోసం గాలిస్తూ, మరోవైపు తన చిన్నకూతురు కూడా అలాగే చేస్తుందేమోనని ఆందోళనపడే ఒక ఫ్యాక్షనిస్ట్ కథతో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన 'పరుగు' సినిమాని ప్రేక్షకులు ఆదరించి, బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించిపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై నేటికి.. అంటే మే 1వ తేదీకి సరిగ్గా 15 యేళ్లు. నీలకంఠం అనే ఫ్యాక్షనిస్టుగా ప్రకాశ్‌రాజ్ నటించిన ఈ సినిమాలో ఆయన చిన్నకూతురు మీనాక్షిగా షీలా చేసింది.
కథ ప్రకారం నీలకంఠం పెద్దకుమార్తె సుబ్బలక్ష్మి (పూనం బజ్వా) తను ప్రేమించిన యువకుడు ఎర్రబాబు (సంజయ్ వెల్లంకి)తో వెళ్లిపోతుంది. దీనికి ఎర్రబాబు మిత్రుడైన కృష్ణ (అల్లు అర్జున్), అతని బృందం కారణమని భావించి, వాళ్లనందర్నీ తన ఇంటి దగ్గర బందీ చేస్తాడు నీలకంఠం. ఆ టైంలోనే ఆయన చిన్నకూతురు మీనాక్షితో ప్రేమలో పడతాడు కృష్ణ. సుబ్బలక్ష్మిని వెతికే క్రమంలో మీనాక్షి సైతం కృష్ణ ప్రేమలో పడుతుంది. ఈ సంగతి తెలిసి, నీలకంఠం ఏం చేశాడు, కృష్ణ-మీనాక్షి ప్రేమకథ ఏమయ్యింది.. అనేది మిగతా కథ.
మొదట ఈ మూవీలో మీనాక్షి రోల్‌కు వేదిక, ప్రియమణి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ప్రియమణి పేరు ఖరారయ్యింది కూడా. తర్వాత అనూహ్యంగా ఆమె స్థానంలో షీలా వచ్చింది. ఆ టైంలో టీవీలో యాంకర్‌గా పాపులర్ అయిన చిత్రలేఖ ఈ మూవీలో మీనాక్షి చెలికత్తె టైపు క్యారక్టర్‌ను చేసింది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, హీరో మిత్ర బృందంలో ఒకడైన యజ్ఞనారాయణ శర్మ పాత్ర చేసి, అందరి దృష్టిలో పడ్డాడు సప్తగిరి. సునీల్, సుబ్బరాజు, జయప్రకాశ్ రెడ్డి, జీవా, ధన్‌రాజ్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కృష్ణ పాత్రలో అల్లు అర్జున్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అంతదాకా చాలా జోవియల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ వచ్చిన అతను ఈ మూవీలో కృష్ణగా చాలా సెటిల్డ్‌గా, హృదయాన్ని కదిలించే నటనను ప్రదర్శించాడు.
మ్యూజికల్‌గానూ 'పరుగు' మంచి పేరు తెచ్చుకుంది. మణిశర్మ బాణీలు కూర్చగా సీతారామశాస్త్రి రచించిన 'హృదయం ఓర్చుకోలేనిది గాయం', అనంత్ శ్రీరాం రాసిన 'నమ్మవేమో గాని అందాల యువరాణి', 'మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో', 'ఎలగెలగా ఎలగా ఎలగెలగా', చంద్రబోస్ రాసిన 'చల్ చల్ చలో' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ మూవీకి విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేశారు.
అదివరకు భాస్కర్‌ను 'బొమ్మరిల్లు'తో దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు, అతని రెండో సినిమా 'పరుగు'నూ నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం.. తర్వాత ఒడియా, బెంగాలీ, నేపాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. హిందీ రీమేక్ 'హీరోపంతి' ద్వారా జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయమై, విజయం సాధించాడు. మలయాళంలో 'కృష్ణ' టైటిల్‌తో డబ్బయిన ఈ మూవీ అక్కడ కూడా విజయ దుందుభి మోగించింది.