చిన్నతెరపై 'జబర్దస్త్' అనే ఒకే ఒక్క షోతో ఓవర్‌నైట్‌లో క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో నాగార్జున మరదలిగా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె నటించిన మూడో సినిమా 'విన్నర్‌లో "సూయ సూయ సూయ సూయ సూయ.. అట్టా ఎట్టా పుట్టాశావే అనసూయ" అంటూ ఆమెపై పాట రాశారంటేనే యూత్‌లో ఆమె క్రేజ్, ఇమేజ్ ఏంటో అర్థమైపోతుంది. అలాంటి అనసూయ బీహారీ అయిన శశాంక్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. సుశాంక్‌తో అనసూయ లవ్ స్టోరీకి అంత ఈజీగా పెళ్లి కార్డు పడలేదు. ఆ స్టోరీ చాలా ఇంటరెస్టింగ్.
అనసూయ వాళ్ల ఫాదర్ సుదర్శన్ రావు.. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్. కార్యకర్తలు ఆయనను "దర్శన్ అన్న" అని పిలుచుకొనేవాళ్లు. సుదర్శన్ రావుకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దది అనసూయే. ఆమె చెల్లెళ్ల పేర్లు.. అంబిక, వైష్ణవి. పెద్దమ్మాయిని ఆర్మీ ఆఫీసర్‌ని చేయాలని సుదర్శన్ రావు అనుకున్నారు. ఎన్‌సీసీ నుంచి ఆర్మీలో చేరడానికి మంచి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఓల్డ్ మలక్‌పేటలోని స్కూల్ నుంచి, వనస్థలిపురంలోని వికాస భారతి స్కూలుకు అనసూయను మార్పించారు.
ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఎన్‌సీసీ క్యాంపులో అనసూయకు సుశాంక్ భరద్వాజ్ పరిచయమయ్యాడు. రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. క్రమంగా ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. ఆమెకు ఇష్టమైన కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ గిఫ్టులుగా ఇచ్చేవాడు సుశాంక్. మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో అనసూయ డిగ్రీ చదువుతుండగా వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట అతనే ప్రపోజ్ చేశాడు. ఎలా రెస్పాండ్ అవ్వాలో అనసూయకు తెలీలేదు. ప్రతి విషయాన్నీ ఇంట్లో వాళ్లతో పంచుకోవడం చిన్నప్పటి నుంచీ ఆమెకు అలవాటు. అందుకే సుశాంక్ విషయాన్ని మొదట అమ్మకూ, నాయనమ్మకూ చెప్పింది. వారి ద్వారా సుదర్శన్ రావుకు తెలిసింది. ఆయన కోపంతో గట్టిగా కేకలేశారు. అప్పుడు పెద్ద గొడవే జరిగింది. సుశాంక్ వాళ్లది బీహార్ అని తెలిశాక ఆయన ఇంకా భయపడ్డారు. అనసూయకు త్వరగా పెళ్లి చేసెయ్యాలని వేరే సంబంధాలు తెచ్చారు. "నేను సుశాంక్‌ను ప్రేమిస్తున్నా. చేసుకుంటే అతడ్నే చేసుకుంటా, ఇంకెవర్నీ చేసుకోను" అని తెగేసి చెప్పేసింది అనసూయ.
ఈ గొడవల మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి కాచిగూడలోని భద్రుకా కాలేజీలో చేరింది. అప్పుడే 'పిక్సలాయిడ్' అనే కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఒకవైపు చదువుకుంటూనే, 2007 నుంచి 2009 దాకా అక్కడ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసింది అనసూయ. 2010 జూన్‌లో సుశాంక్ భరద్వాజ్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్లతో పోరాడి, ఎట్టకేలకు నాన్న సుదర్శన్ రావును ఒప్పించి మరీ ఈ పెళ్లి చేసుకుంది.
ఏడాది తిరిగేసరికల్లా 2011లో మొదటి అబ్బాయి 'శౌర్య' పుట్టాడు. 2013లో అనసూయకు 'జబర్దస్త్' యాంకర్‌గా ఆఫర్ వచ్చింది. ఆ షో ఇన్‌స్టంట్‌గా హిట్టవడం, యాంకర్‌గా అనసూయకు క్రేజ్ రావడం జరిగిపోయాయి. బీహార్‌లో దీపావళి తర్వాత ఆరు రోజులకు సూర్య భగవానుడిని పూజిస్తూ 'చత్' అనే వేడుక జరుపుతారు. సరిగ్గా ఆరోజు పుట్టాడు కాబట్టి రెండో కొడుక్కు 'అయాంచ్' అనే పేరు పెట్టుకున్నారు. అయాంచ్ అంటే సూర్యుడు అని అర్థం. ఇదీ.. తెలుగు టీవీ తెరపై తొలి గ్లామరస్ యాంకర్ అనసూయ లవ్ స్టోరీ.