బాలనటునిగా 'అతడు', 'ఛత్రపతి' సినిమాలతో ఆకట్టుకొని, ఆ తర్వాత హీరోగా 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఒక క్రిమినల్ ప్రేమ కథ' లాంటి సినిమాలతో యూత్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు మనోజ్ నందం. ఆ తర్వాత ఆశించిన రీతిలో అతడి కెరీర్ ఊపందుకోలేదు. ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూ, మరోవైపు సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న దుల్కర్ సల్మాన్ మూవీ 'సీతారామం'లో ఆర్మీమేన్‌గా సపోర్టింగ్ రోల్లో కనిపించబోతున్నాడు.
మనోజ్ వాళ్లమ్మ కేన్సర్‌తో బాధపడుతూ 2015లో మృతి చెందారు. "2012లో ఆమెకు కేన్సర్ అని తేలింది. 2015లో చనిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో వరసపెట్టి సినిమాలు చేసేశాను. కారణం, నాకు డబ్బు అవసరం ఉంది. అమ్మ హాస్పిటల్ బిల్స్‌కీ, ఇతరత్రా ఖర్చులకు డబ్బు బాగా అవసరం అయ్యింది." అని తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు.
వాళ్ల నాన్న బిజినెస్‌మేన్ అయినా అంతగా ఆదాయం ఉండేది కాదు. "అంతకుముందే ఆయనకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆయన ఓఎన్జీసీ కాంట్రాక్టర్‌గా చేసి, తర్వాత హ్యాండ్లూమ్ బిజినెస్ చేశారు. అందులో నష్టాలు వచ్చాయి. అంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. నాకు వచ్చిన పని, నటించడం. ఆ పనిచేసి, డబ్బులు సంపాదించి, కుటుంబానికి సపోర్ట్‌గా నిలిచాను. అందువల్ల డబ్బుల్లేక అమ్మను చూసుకోలేకపోయాననే గిల్ట్ అయితే లేదు. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా అమ్మ దక్కలేదనే బాధ మాత్రం ఉంది." అని చెప్పుకొచ్చాడు మనోజ్.