తెలుగు ప్రేక్షకుల్ని కొన్నేళ్ల పాటు తన మత్తుకళ్లతో, నాట్య విలాసాలతో, ఒంపుసొంపులతో అలరించిన తార సిల్క్ స్మిత. ఐటమ్ గాళ్‌గా ఆమెకు సాటి రాగలవారు లేరు అనే రేంజ్లో ఆమె కీర్తిని సంపాదించుకుంది. అయితే.. అనూహ్యంగా తన అభిమాన సందోహాన్ని విషాదంలో ముంచేస్తూ, చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని పరలోకానికి వెళ్లిపోయింది.
ఏలూరులోని క్రిస్టియన్ కాన్వెంట్లో పదో తరగతి చదువుతుండగానే స్మిత తమ డాన్స్ మాస్టర్ పార్వతి దగ్గర నాట్యం నేర్చుకునేది. 'వండి చక్రం' అనే తమిళ చిత్రంలో చేసిన 'సిల్క్' అనే గ్లామరస్ రోల్‌తో పరిచయమైంది స్మిత. ఆ చిత్రంలోనూ, ఆ తర్వాతి చిత్రాల్లోనూ ఆమె నాట్యమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలోకి కథానాయికగా, నటిగా రాణించాలని వెళ్లిందా? లేక నాట్యతారగానే రాణిద్దామనుకుందా? "సినిమాల్లో వేషాలు వెయ్యాలన్న ఉత్సాహంతోనే నేను మద్రాస్ వెళ్లాను. ఆ వేషం డాన్సర్ కానివ్వండి, క్యాబరే ఆర్టిస్ట్, వ్యాంప్, ఏ క్యారెక్టర్ కానివ్వండి, చివరకు హీరోయిన్ క్యారెక్టర్ అయినా వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగానే భారతీరాజాగారి అలైగళ్ ఓయ్వదిల్లై (తెలుగు సీతాకోకచిలక) చిత్రంలో ఒక మంచి పాత్ర ధరించి ప్రేక్షకుల మెప్పు పొందాను. మూన్రాంపిరై మూవీలో కమల్ హాసన్ సరసన నేను చేసిన నాట్యమే కాక, ముసలి మొగుడితో సుఖం పొందలేని యువతిగా నా నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అని అప్పట్లో ఆమె చెప్పుకొచ్చింది.
"క్లబ్ సాంగ్స్‌లో, స్పెషల్ సాంగ్స్‌లో చాలీ చాలని దుస్తులు ధరించి నాట్యం చేస్తుంటారు కదా.. ఈ విషయంపై కొత్తల్లో మీరెలా ఫీలయ్యేవారు?" అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. "నాకు చిన్నప్పటి నుంచి గౌన్లు, మినీ, మాక్సీ డ్రస్‌లు వంటి మోడరన్ దుస్తులు ధరించడమే అలవాటు. అందువల్ల ఆ దుస్తులు ధరించడంలో నాకు కొత్తేమీ లేదు. అదీకాక నా ధ్యేయం అభిమానుల ఆదరణ పొందాలన్నది. అందువల్ల పాత్రకు తగ్గ దుస్తులు ధరించడంలో నేనెప్పుడూ ఏ విధంగానూ ఫీలవలేదు" అనేది ఆమె సమాధానం.