శక పురుషుడు ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'మేజర్ చంద్రకాంత్'. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని మోహన్ బాబు నిర్మించారు. సినిమాలో ఎన్టీఆర్, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా నటించారు. 1993 ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది.
షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండస్ట్రీలో సమ్మె కారణంగా రాత్రికి రాత్రే షూటింగును హైదరాబాదు నుంచి బెంగళూరుకు నిర్మాతలు షిఫ్ట్ చేశారు. యూనిట్ మెంబర్స్ అందరూ కర్ణాటక ప్రభుత్వ అతిథి గృహం కుమార కృపలో దిగారు. "పుణ్యభూమి నాదేశం" పాటలోని కొంత భాగాన్ని లలిత్ మహల్ రాజ్ మహల్ ప్యాలెస్ లో చిత్రీకరించారు. ఆ ప్రాంగణంలోని మధ్య భాగంలో ఓపెన్ ఎయిర్ దర్బార్ సెట్టు, 15 అడుగుల ప్లాట్ఫామ్ మీద ఒక తఖ్తు, దానిమీద సింహాసనం ఏర్పాటు చేశారు.
తెల్ల దొరల దురాగతాలను చీల్చి చెండాడుతూ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న గెటప్ లో ఎన్టీఆర్ "ఎందుకు కట్టాలిరా శిస్తు.. నారు పోశారా నీరు పోసారా కోత కోశారా కుప్ప నూర్చారా.." అంటూ ఉద్వేగ భరితంగా ఆవేశంతో కాళ్ళ ముందు ఉన్న తఖ్తును కింద ఉన్న తెల్ల దొర పాత్రధారి మీద పడేట్లు తన్నుతూ ఉంటే ఒక్కసారిగా ప్లాట్ఫారం కదిలి జర్క్ ఇచ్చింది. దాంతో ఒంటిమీద భారీ కాస్ట్యూమ్ తో ఎన్టీఆర్ ఓ పక్కకు వాలిపోతున్నారు. కింద పడితే పెద్ద ప్రమాదం తప్పదు. ఏమైతేనేం ఓ క్షణం తమాయించుకొని పెద్ద ప్రమాదం అంచున ఆగిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ స్థాణువులై కళ్ళప్పగించి చూస్తున్నారు.
మోహన్ బాబు గబగబా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి "అన్నయ్యా.. షూటింగ్ ఆపేద్దాం. ఎంత నష్టం వచ్చినా సరే నాకు ఈ సినిమా వద్దు. మీ ఆవేశంలో మీకు ఏదైనా జరిగితే మేం జీవితాంతం ఎదుర్కొనే క్షోభ కంటే ఈ నష్టం ఎక్కువ కాదు." అని అభ్యర్థించారు.
ప్రమాదం అంచుకి వెళ్లి కూడా ఎన్టీఆర్ చిరునవ్వుతో ఏమి జరగనట్లుగానే మోహన్ బాబును అనునయిస్తూ "మీవంటి ఆత్మీయులు అభిమానుల అండదండలు ఉండగా మాకే ప్రమాదం జరగదు బ్రదర్" అని ఆయన భుజం తట్టారు. షూటింగ్‌ను కొనసాగించారు. దటీజ్ ఎన్టీఆర్!