![]() |

షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో'(O Romeo). ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
షాహిద్ కపూర్ బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 'వివాహ్', 'జబ్ వి మెట్' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే, ఇటీవల కాలంలో అతని చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు. 'ఓ రోమియో' కూడా మిక్స్డ్ టాక్ కే పరిమితమైనా.. ఇందులో షాహిద్ పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఇక ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటించడం అదనపు ఆకర్షణగా నిలిచింది.

హిందీ సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీ ఎంట్రీ ఇస్తుంటాయి. అయితే 'ఓ రోమియో' మాత్రం ఆరు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. మార్చి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి రానుంది. అంటే సబ్స్క్రిప్షన్ ఉన్నా, ఈ సినిమా చూడాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. ఎనిమిది వారాల తర్వాత, అంటే ఏప్రిల్ 10 నుంచి సబ్స్క్రైబర్స్ కి నార్మల్ గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందితే, షాహిద్ కపూర్ మళ్లీ తన ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, త్రిప్తి డిమ్రికి మరిన్ని మంచి అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. ఇప్పటికే ఆమె ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ ఫిల్మ్ 'స్పిరిట్'లో నటిస్తుండటం విశేషం.
![]() |