పొన్నియిన్ సెల్వన్ టీమ్ టీమంతా ఇప్పుడు ముంబైలో ప్రచారం చేస్తోంది. వాళ్ల జోరును చూసి అసలు ఈ మధ్య నార్త్ లో అనువాదమై విడుదలైన మన సినిమాలు ఏమాత్రం వసూలు చేశాయనే చర్చ హైదరాబాద్‌లో గట్టిగానే జరుగుతోంది. పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్టుకు తమిళ్‌లో అద్భుతమైన స్పందన వవచ్చింది. హిందీలో మాత్రం జస్ట్ పాతిక కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందు నార్త్ బెల్ట్ లో చాలా తక్కువ కలెక్షన్లతోనే మొదలైనప్పటికీ, చోళుల కథకి మంచి మౌత్ టాక్ రావడంతో ఆ ఫిగర్ అయినా వసూలైంది. ఈ వారంలోనే సీక్వెల్ సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ పెంచిన ఎక్స్ పెక్టేషన్స్ తో సెకండ్ పార్టుకి ఏమాత్రం కలెక్షన్లు దక్కుతాయో చూడాలి.
అటు చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల గురించి జనాలు గట్టిగానే ఆరా తీస్తున్నారు. తెలుగులో విడుదలైన వాల్తేరు వీరయ్యని హిందీలో అనువాదం చేసి విడుదల చేశారు. హిందీ మార్కెట్‌లో జస్ట్ 1.38 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతున్న మాట. నాని నార్త్ లో అమితంగా ప్రమోట్ చేసుకున్న దసరా మూవీకి హిందీ బెల్టులో 4.67 కోట్ల కలెక్షన్ రికార్డ్ అయింది. సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా మన దగ్గర అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. హిందీలో ఈ సినిమాకు 1.22 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాకు 7.92 కోట్లు కలెక్ట్ అయ్యాయన్నది వినిపిస్తున్న మాట. ఉపేంద్ర నటించిన కబ్జా మన దగ్గర అసలు ఆడిన దాఖలాలు లేకపోయినా హిందీ మార్కెట్లో మాత్రం 3.25కోట్ల కలెక్షన్లకు నమోదు చేసింది.