![]() |
![]() |
బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన స్టెప్పులతో కాకుండా, ఒక వివాదం విషయంలో ఆమె స్పందించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 'KD ది డెవిల్' సినిమాలోని వివాదాస్పద 'సర్కే చునార్' పాటపై తలెత్తిన వివాదానికి నోరా ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరైన ఆమె, ఈ అంశంపై తన విచారం వ్యక్తం చేశారు.
ఈ పాటలోని సాహిత్యం మహిళలను కించపరిచేలా ఉందంటూ గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మహిళా కమిషన్ సభ్యులను కలిసిన నోరా, రాతపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఒక కళాకారిణిగా జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. కేవలం క్షమాపణలతోనే ఆగకుండా, కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యతలను స్పాన్సర్ చేస్తానని నోరా ప్రకటించడం విశేషం.
నిజానికి ఈ వివాదంపై నోరా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. తాను ఈ పాట కన్నడ వెర్షన్లో మాత్రమే నటించానని, హిందీ వెర్షన్ సాహిత్యం గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని ఆమె పేర్కొన్నారు. తన అనుమతి లేకుండానే ఆ వెర్షన్‌ను విడుదల చేశారని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నెట్టింట విమర్శలు పెరగడంతో మూవీ మేకర్స్ ఇప్పటికే ఆ వివాదాస్పద హిందీ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.
ఇదే పాట వివాదంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఇదివరకే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన కూడా సుమారు 50 మంది గిరిజన బాలికల విద్యకు సాయం చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు నోరా కూడా అదే బాటలో నడిచి సామాజిక బాధ్యతను చాటుకోవడం పట్ల ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
![]() |
![]() |