మన ఇంట లక్ష్మి కొలువై నిలవాలి
ధనత్రయోదశి
కార్తీక మాసపు పండుగల సంబరాలు, పవిత్రదినాల పుణ్యఫలాలు, పూజలు, వ్రతాలు సంభారాలు ధన త్రయోదశితో మొదలవుతాయి. తెలుగువారికిది అలవాటు లేదు. నిజానికి అప్పటికి మనకి కార్తీక మాసం ప్రారంభమేకాదు, మనకది ఆశ్వీయుజకృష్ణ త్రయోదశి. ఉత్తర దేశీయులు మాత్రం దీనిని ధనత్రయోదశి అని "ధన్ తెరాస్" అనే పేరుతో జరుపుకుంటారు. నిజానికి ఔత్సాహికులకి దీపావళి అన్నింటికన్నా పెద్దపండగా ఎన్నోరోజులు ముందు నుంచే దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. దీపావళి రెండు రోజుల ముందే ధనత్రయోదశి పేరుతో వేడుకలు ప్రారంభమౌతాయి.
దేవదానవులు అమృతం కోసమే సముద్ర మధనం చేసినా అందులో నుండి అమృతం కన్నా ముందు జగత్తులోని శ్రేష్ట వస్తు సముధాయమంత ఉద్భవించింది. అలాంటి వాటిలో చెప్పుకోదగిన ఆయుర్వేదాన్ని తనతో తెచ్చి లోకానికి అందించిన ధన్వంతరి. ధన్వంతరి పాల సముద్రం నుండి ఉద్భవించిన రోజునే ధనత్రయోదశిగా పాటించడం జరుగుతోంది. ధన్వంతరి ఆయుర్వేదం జనించిన రోజుని ఆయుర్వేద లేదా ఆరోగ్య త్రయోదశి అనవలసింది కదా! అనిపిస్తుంది. ధనమంటే మనం అనుకునే కాగితాల డబ్బు కాక జీవనానికి ఉపయోగపడేది అని అర్ధంలో 'ధన' అని ఉండవచ్చు. భారతీయుల దృష్టిలో ధనమగ్నిర్ధనం వాయుః ధనమింద్రోబృహస్పతిః వీటినన్నిటిని వినియోగించుకోగలిగిన శక్తి అసలైన ధనం అదే ఆరోగ్యం, అదే ఆయువు దానిని ప్రసాదించేది అని అర్ధం ఇక్కడ బాగా సరిపోతుంది ధన శబ్దం ధన్వంతరి జన్మించిన రోజు, ధన్వంతరిని పూజించే రోజు కనుక అది ధన త్రయోదశి గా పిలవబడుతుంది.
ఆ రోజు ధన్వంతరితోపాటు మృత్యువుకి అధిపతి అయిన యమధర్మరాజుని కూడా పూజించటం, ప్రాచీనుల సంప్రదాయం ఆయుర్వేద లక్ష్యం దీర్ఘాయువు, అకాల మృత్యుహరణం. కనక లక్ష్య సిద్ది కోసం, ధన్వంతరితో పాటు , యముని ఆరాధించడం సముచితం, యముని పూజ చీకటి పడ్డాక చేస్తారు.
సింహద్వారం దగ్గర దీపంపెట్టి- ఒక గవ్వ రాగి నాణెం, పూలు దీపానికి సమర్పించి భియ్యం, బెల్లం నైవేద్యం పెట్టాలి. పూజ అయినాక రాగి నాణెం, గవ్వ- ధనలక్ష్మికి ప్రతీకలుగా ఇనపెట్టెలో దాచుకుంటారు. ఈ వ్రతానికి సంబందించిన కథ కూడా ఉంది. హేమరాజు, లేక లేక కలిగిన కుమారుడు వివాహమైన నాలుగవ రోజునే మరణిస్తాడని జ్యోతిష్కులు చెప్పగా కుమారుని బ్రహ్మచారిగానే ఉంచాలనుకుని యమున నది ఒడ్డున ఉన్న గుహలో దాచి ఉంచాడు.
కానీ ఆ బాలుడు హంసరాజు కుమార్తెను గాంధర్యవిధిని వివాహ మాడతాడు. నాలుగవ రోజున యమదూతలతని ప్రాణాన్ని హరిస్తున్నపుడు ఆమె విలాపం వారి హృదయాలను కూడా నిర్వేదానికి గురిచేసింది. విధి నిర్వహణ గురించి తమని ప్రశ్నించిన యమునికి దూతలు ఆ విషయాన్ని తెలుపుతారు.
విన్న యమ ధర్మ రాజు కూడా నిర్వేదానికి లోనవుతాడు. ఇటువంటి అకాల మృత్యువుని ధన త్రయోదశి పూజ చేయటం ద్వారా నివారించవచ్చునని చెపుతాడు.
ఈ కారణంగానే కాబోలు ధన త్రయోదశిని మర్నాడు వచ్చే నరక చతుర్ధశి ప్రేత చతుర్ధశి అని కూడా అంటారట. ఆనాడు సూర్యోదయానికన్నాముందే లేచి అభ్యంగన స్నానం చేసి "యమాయతర్పయామి" అని మూడు సార్లు యమునికి తర్పణమిచ్చి యముని "యమాయ ధర్మరాజయా మృత్యువే చాంతకాయచ వైపస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయచ ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే మహోదరాయ చిత్రాయ చిత్ర గుప్తాయతేనమః'' అని స్తుతిస్తారట. నరక లోకాధిపతికి సంబందించినది అవటం వల్ల కూడా నరకచతుర్ధి అని పిలవబడి ఉండవచ్చు. అశౌవచము, అమంగళము, అజ్ఞానము వంటివన్నీ పాపహేతువులు. నరక కారకములు వాటిని పోగొట్టటానికి యముని తృప్తిని చెయ్యాలి
ధనత్రయోదశి నాటి యమపూజలోని ప్రశిస్ట అంశమే చతుర్ధశి నాటి యమతర్పణం. అంతే కాదు దీపావళి నాడు పితృదేవతలకి తర్పణలు వదలడం, తమని తమ ఇంటిని చూడడానికి వచ్చే పితృదేవతలకి దారి చూపడం కోసం దక్షిణ దిక్కుకి తిరిగి దివిటీలు వెలిగించి కొట్టి, తర్వాత కాళ్ళు కడుక్కోవడం మొదలైనవన్నీ, యమసంబందిత గాధలకి చిహ్నలే.
ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయకంగా విశ్వసించబడే ధన త్రయోదశి కార్తీక మాసపు పండుగలలో ప్రథమం. తరువాతది నరక చతుర్ధశి.
- డా. అనంత లక్ష్మి