అజ్ఞానానికి, చీకటికి ప్రతీక నరకుడు
నరక చతుర్ధశి
ధన త్రయోదశి తరువాతి రోజు నరక చతుర్దశి ఇది యావద్భారత దేశమూ జరుపుకునే పండుగ. ఉత్తర భారతం వారి లెక్కల ప్రకారం ఇది కార్తీక బహుళ చతుర్దశి నాడు వస్తుంది. తెలుగువారికి అది ఇంకా ఆశ్వయుజ బహుళ చతుర్ధశే. రెండు రోజులు జరుపుకునే దీపావళి పండుగలో ముందురోజు నరకచతుర్దశి. నరక చతుర్ధశికి అంతటి ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందో భారతీయులందరికీ ఇంతో అంతో తెలుసు. ఆది వరాహ మూర్తి అయిన విష్ణువు భూదేవిని ఉద్ధరించిన కాలంలో వారిరువురకూ జన్మించిన వాడు నరకుడు ఇతడు ప్రాగ్జ్యోతిష్యాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రాగ్జ్యోతిషం అంటే ముందుగా వెలుగును చూచే దేశం అని అర్థం.భారత దేశంలో మొదటగా సూర్యకిరణ ప్రసారం పొందే ప్రదేశం అది నేటి అస్సాం! భాగవతంలో క్రమ వికాసంలో ద్రవ పదార్ధం నుండి ఘనపదార్థం పుట్టుకకు సంబంధించిన ప్రతికాత్మక కథ ఇది.
కర్దమము అంటే బురద ఘనీభవించిన ఘనపదార్థం ఆవిర్భవించటం ఆ భూమి వసుంధరగా సమస్తమైన సంపదలను, ఔషధాలను, ఖనిజములను ఇస్తుంది. దాని ఫలితాన్ని పొందటానికి భూపుత్రుడు అన్ని అర్హతలు హక్కులు కలవాడు కానీ, నరకుడు ఆ హక్కులను దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ సంపదలనే కాదు వెలుగుని కూడా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అతడు బ్రహ్మ వల్ల వరాలు పొంది ఆ వరగర్వంతో దేవతలను, మానవులను, సాధువులను హింసిస్తూ రాజకుమారులనూ, రాజకుమార్తెలనూ (పదహారువేల మంది) చెరపట్టి, ఆదితి కర్ణ కుండలాలనూ, వరణుని ఛత్రాన్నీ కూడా హరించాడు. ఇంద్రుడు ప్రార్థిస్తే కృష్ణుడు నరకునిపై యుద్ధానికి బయలుదేరాడు. సత్యభామ తన యుద్ధవిద్య సార్థకం చేసుకోవటానికి ముచ్చటపడుతుంది. సత్యభామ సహాయంతో శ్రీ కృష్ణుడు నరకుని పరివారంతో సహా నామరూపాలు లేకుండా చేస్తాడు. లోకం ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకొంది.
పూర్వజన్మలో తన కుమారుడైన నరకున్ని తన కళ్ళముందే చంపుతున్నందుకు సత్య బాధపడలేదు. కానీ ఆ వేడుకలు తన కుమారుని పేరిట జరగాలని కోరిందట. ఆ కారణంగా శ్రీకృష్ణుని విజయోత్సవం "నరక చతుర్దశి''గా ప్రసిద్ధమైంది. శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుని చెరసాలలో ఉన్నవారందరినీ బంధ విముక్తులను చేశాడు. రాజకుమారులు కృష్ణుని పొగిడి యధేచ్చగా పోగా, పదనారు వేళ వందమంది రాజ కుమార్తెలు మాత్రం చెర విడిపించిన శ్రీ క్రిష్ణున్నే "కన్నెచెర'' విడిపించమని ప్రార్థించారు. వారందరికీ శ్రీ కృష్ణుణ్ణి చూడగానే మధుర భావం కూడా కలిగిందట. ప్రక్కనున్న సత్యభామ వంక చూడగా ఆమె తన కంటి చూపుతోనే అనుమతించిందట. సత్యభామ సమక్షంలో శ్రీ కృష్ణుడు ఒకే ముహూర్తంలో పదనారవేల మంది రాజకుమార్తెల పాణిగ్రాహం చేశాడట. (ఈ పదనార వేళ వంద మంది గోపికలుకారు రాజకుమార్తెలు)
నరకుని మరణం జగదానందకారకం. నరకుని భయానికి మనుషులు ఇల్లు వదిలి వచ్చేవారు కాదు. తమ ఉనికి తెలుస్తుందని దీపాలు కూడా వెలిగించేవారు కాదు. అతడి చావుతో అందరూ కరువుతీరా దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి, పిండివంటలు మిఠాయిలు చేసుకున్నారట. ఇది భాగవత విష్ణు పురాణాదులలోని కథ. నరకుడు అజ్ఞానానికి, పాపానికి, చీకటికి ప్రతీక, అసలు నరకుండంటేనే నరకహేతుకమైన వాడని అర్థం. భూమిపైన మానవులందరికీ నరకమంటే ఏమిటో చవిచూపిన వాడు తొలిసారిగా తన ప్రాంతంలో పడిన సూర్యకాంతిని ఇతరులకు అందకుండా ఆపినవాడు అందుకే అతడు చనిపోగానే అందరూ దీపాలు వెలిగించి సంబరపడటం జరిగింది. నరకుడు భూదేవి పుత్రుడు. భూమిపైనున్న సంపదలన్నీ అతని సొత్తే. కానీ, దుర్వినియోగాన్ని ఎవరూ సహించరు కదా! ఒక్క దుష్టుని నాశనంతో జీవులందరినీ ఉద్ధరించే మంచి తల్లి ప్రకృతి మాత భూదేవి. తల్లులందరికీ ఆదర్శం.
"శరీరమే నేను అన్న అభిమానమే నరకం ఆ అభిమానం ఉన్న వాడే నరకుడు. ఆ అభిమానం ఉన్నవాడు మహా రాజాధిరాజైనా వాని జీవితం నరకమే. ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి. అహంకారమమకారాలను, అరిషడ్వర్గాలను జయించి సర్వ జీవులపై ప్రేమను వర్షించి, జ్ఞానాన్ని పంచటమే నరకాసుర వధ. మానవుడు తనలోని తమోగుణాన్ని, అసుర లక్షణాలని దమించుటమే నరకాసుర వధ. జ్ఞాన జ్యోతి ప్రజ్వలనమే సత్యాకృష్ణుల విజయం.
- డా. అనంత లక్ష్మి