గాయత్రీదేవిని ఎలా పూజించాలి

 

పిల్లవాడికి ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకొని... దాన్ని తీరుస్తుంది తల్లి. అమ్మవారు కూడా అంతే! మనకి ఆహారం కావల్సినప్పుడు అన్నపూర్ణగా మారుతుంది. చదువు కావల్సినప్పుడు సరస్వతి అవుతుంది. ఆ అమ్మవారు మనల్ని ఆదుకునే తీరుని బట్టి ఆమెను వేర్వేరు రూపాలలో పూజించుకునే సందర్భమే దసరా! అలా దసరా సందర్భంగా పూజించే రూపాలలో గాయత్రీదేవి అలంకారం కూడా ఉంది.

వేదాల నుంచి పురాణాల వరకూ గాయత్రి దేవిని జ్ఞానానికి ప్రతరూపంగా చెబుతూ వచ్చారు. గాయత్రి అమ్మవారిని తల్చుకున్నా, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని పెద్దల నమ్మకం. గాయత్రి మంత్రంలో కనిపించించే ‘ధియోయోనః ప్రచోదయాత్”కి అర్థమిదే. ఇంతకీ  దసరా సందర్భంగా ఈ గాయత్రీ అమ్మవారిని ఎలా పూజించుకోవాలో చెప్పనే లేదు కదూ!

హిందువులు తామరపూలని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రీ అమ్మవారికి కూడా తామర పూలంటే చాలా ఇష్టమట. దసరా సందర్భంగా గాయత్రీదేవిని పూజించేటప్పుడు ఒక్క తామరపూవైనా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. ఇక అమ్మవారిని ఆ రోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఉదయపు సూర్యకిరణాలు నారిజం రంగులో ఉంటాయి. సూర్యుడి వెలుగులాగా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది కాబట్టి నారింజ రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు.

ఈ రోజు అమ్మవారిని గాయత్రి అష్టోత్తరంతో పూజిస్తే మంచిది. అలా కుదరని పక్షంలో “ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి  ధీయో యోనః ప్రచోదయాత్!” అనే మంత్రంతో ఆరాధించాలి. అదీ వీలుకాని పక్షంలో  ‘ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః’ అన్న మంత్రంతో పూజించాలి. పూజ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఏదీ కుదరకపోతే రవ్వకేసరి లేదా ఉత్త పంచదార పెట్టినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు రూపాలలో పూజించేటప్పుడు వేర్వేరు వస్తువులు తినకూడదని చెబుతారు. అలా గాయత్రీదేవిని పూజించే రోజున వంకాయ‌లతో వండిన పదార్థాలు తినకూడదట.

ఈ రకంగా గాయత్రీ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి లోటూ రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదరికం, ఆకలిలాంటి కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయట. పిల్లలు కావాలనుకునేవారికి సంతానం, బాధల్లో ఉన్నవారికి మనశ్శాంతి లభించి తీరుతుంది. అన్నింటికీ మించి జీవితంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విచక్షణ ఏర్పడుతుంది.