అష్టాదశ భుజాలతో, నవరత్నమణిమయ భూషణాలు ధరించి, సముజ్వల కాంతితో, సింహవాహినియై తమ ముందు సాక్షాత్కరించియున్న ఆ జగజ్జననిని చూసి ఇంద్రాది దేవతలందరూ పరిపరి విధాల ప్రస్తుతించారు. ఆ మహాదేవి దర్శనంతోనే మహిషుని పీడ తొలగినట్టుగా భావించారు. అప్పుడు మహేంద్రుడు వినయంగా చేతులు జోడించి., ఆమెతో ‘జగన్మాతా.,బ్రహ్మవరప్రసాదితుడైన మహిషాసురుడు సకల దేవతలను యుద్ధరంగంలో పరాజితులను చేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. యఙ్ఞయాగాదుల్లో దేవతలకు చెందవలసిన హవిర్భాగాలను అపహరిస్తున్నాడు. మునిజనహింస, ధర్మనాశనం వాడి నిత్యకృత్యాలు. కామరూపియైన మహిషుడు స్త్రీ వధ్యుడు. వాడిని నీవే సంహరించాలి. నీవే మాకు దిక్కు. కాపాడు తల్లీ’ అని ప్రార్థించాడు. ‘దేవతలారా..మీకందరికీ అభయం ఇస్తున్నాను. ధైర్యం వహించండి. చూసారా..విధి ఎంత బలీయమైనదో. పరాజయమే ఎరుగని త్రిమూర్తులంతటి వారుకూడా మహిషుని చేతిలో ఓటమిని రుచి చూసారంటే..అది కాలమహిమ కాక మరేమనాలి. అందుకే మహిషసంహారం కోసం నేను కాలంలో నుంచే ఉద్భవించాను. మహిషాసురుని నేను సంహరిస్తాను. ధైర్యం వహించండి’ అని మహాదేవి పలికి ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. ఆ భీకర ధ్వని దశదిశలు వ్యాపించింది. భూమి కంపించింది. మహాపర్వతాలు గడగడలాడాయి.మహాసముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ఇంద్రాదిదేవతలు సంతోషంతో జయజయధ్వానాలు చేసారు.