మహిషాసురుని చేతిలో పరాజితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని కైలాసంచేరి పరమేశ్వరునికి నమస్కరించారు. పరమేశ్వరుడు కూడా దేవతలందరి యోగ క్షేమాలు విచారించిన తర్వాత.. వారి ఆగమన కారణం గురించి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహాదేవా., ఈ ఇంద్రాది దేవతలు మహిషుడి వల్ల స్వర్గపదభ్రష్ఠులై, అడవులబడి తిరుగుతూ, నానా క్లేశాలు పడుతున్నారు. ఈ విషయం నీకు తెలియనిది కాదు. నీవు సర్వసమర్థుడవు. నీవే దేవతలను కాపాడాలి’ అన్నాడు. అప్పుడు శివుడు పకపకా నవ్వి ‘ఇది మరీ బాగుంది., మహిషుడు కోరిన వరాలు ఇచ్చి, దేవతలను కష్టాలకు గురి చేసింది నువ్వు., వారిని కాపాడాల్సింది నేనునా. నేను మాత్రం ఏం చెయ్యను? మహిషుణ్ణి చంపడానికి నేనేం స్త్రీని కాదే. పోనీ నీ భార్యకు, నా భార్యకు యుద్ధంచేసే శక్తి ఉందా అంటే..అదీ లేదే. శచీదేవికి కూడా మహిషుడిని ఎదిరించే శక్తి ఉందని నేనే అనుకోను. అయినా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును వదిలి మనమందరం సమాలోచన చేయడం మర్యాదకాదు. శ్రీహరి కార్యసాధకుడు. మహామేధావి. మనమంతా కలిసివెళ్లి శ్రీహరిని సలహా అడుగుదాం. ఆయన చెప్పినట్టు చేద్దాం. రండి’ అన్నాడు.