ఉసిరికాయ స్పెషల్స్
కేరళ స్టైల్ ఉసిరి ఆవకాయ
కేరళ వాళ్ళు ఉసిరి పచ్చడి చేయటంలో ఓ ప్రత్యేకత చూపిస్తారు. అదేంటో చూడండి.
కావలసినవి:
ఉసిరికాయలు - ఒక కేజీ
కారం- అర కప్పు
ఎండుమిర్చి - పది
ఆవాలు - రెండు స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి- ఒక స్పూన్
ఇంగువ - అర స్పూన్
వెల్లుల్లి- పది రెబ్బలు
కరివేపాకు- తగినంత
వెనిగర్- నాలుగు స్పూన్లు
ఉప్పు- అర కప్పు
నీళ్ళు- ఒకటిన్నర కప్పు
నూనె - మూడున్నర కప్పులు
పసుపు- చిటికెడు
తయారీ :
ఒకటిన్నర కప్పుల నీళ్ళలో ఉసిరికాయలని ఉడికించాలి. మెత్తగా ఉడికాక తీసి చల్లార్చి నాలుగు ముక్కలుగా కొయ్యాలి. ఉడికించిన నీటిని పక్కన ఉంచాలి. ఉసిరి కాయలకి ఉప్పు చేర్చి కలపాలి. మూకుడులో నూనె వేసి ఆవాలు, మిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి,కరివేపాకు ,ఇంగువ వేసి వేగాక నెమ్మదిగా కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి కలపాలి సన్నని మంట మీద ఉంచాలి. ఇప్పుడు ఉసిరికాయలని కూడా ఆ మూకుడు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉసిరి కాయలని ఉడికించిన నీటిని చేర్చి ఒక నిముషం పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆపి పచ్చడి గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల వెనిగర్ ని కలపాలి. చల్లారక పొడి సీసాలో పెట్టుకుంటే నెలవరకు పాడవకుండా ఉంటుంది. కేరళ స్టైల్ ఉసిరి ఆవకాయ రుచి ఎలా వుంటుందో చూడాలంటే వేడి వేడి అన్నం నేతితో కలుపుకుని తినటమే.
ఇన్స్టంట్ ఉసిరి ఆవకాయ
నిల్వ ఆవకాయలో నూనె,ఉప్పు కూడా కాస్త ఎక్కువ వేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా తినటానికి ఇష్టపడరు.అలాంటప్పుడు అప్పటికప్పుడు ఓ పదిహేను నిముషాల్లో ఇన్స్టంట్ గా ఉసిరి ఆవకాయ చేసుకోవచ్చు.
కావలసినవి :
ఉసిరికాయలు
ఎండుమిర్చి
ఆవాలు
పసుపు
ఉప్పు
నూనె
ఇంగువా
తయారీ విధానం :
ముందుగా నీటిని వేడిచేసి ఉసిరికాయలని ఉడికించాలి. మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టుకుని చల్లార నివ్వాలి. ఉడికించిన ఉసిరికాయలు చల్లారాక ముక్కలుగా కోసి పెట్టుకుని వాటిలో చిటికెడు
పసుపు, ఉప్పు, కలపాలి.ఆవాలు,ఎండుమిర్చి,ఇంగువ, నూనెలో వేయించి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఆ పొడిని ఉసిరి కాయల మిశ్రమానికి కలిపి ఆపైన ఇంగువ,ఆవాలుతో పోపు చేస్తే రుచికరంగా ఉండే ఉసిరి ఆవకాయ క్షణాల్లో సిద్దం.
Note : నీళ్ళల్లో ఉడికించటానికి బదులు కుక్కర్ లో ఆవిరి పెట్టినా ఉసిరికాయలు మెత్తబడతాయి.
- రమా