టమాట కరివేపాకు పచ్చడి
కావాల్సిన పదార్థాలు:
నూనె - రెండు టీ స్పూన్స్
నువ్వులు- రెండు టీ స్పూన్స్
పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - పది నుంచి పదిహేను
కరివేపాకు - 75 గ్రాములు
టమాటాలు - 300గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
టమాటా కరివేపాకు పచ్చడి తయారు చేసే ముందు స్టౌ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కాక అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత అందులో పచ్చికొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటిని ఒక ప్లేటులోకి తీసుకోవాలి. అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు, ఉప్పు వేసుకుని కలపాలి.
టమాట ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాట ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాట ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత తాళింపునకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తర్వాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన టమాట కరివేపాకు పచ్చడి రెడీ.