ఉసిరికాయ స్పెషల్స్

 

 

ఉసిరికాయలు విరివిగా దొరికే కాలం ఇది. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెల్సిందేగా, అయితే సాదారణంగా నిల్వ పచ్చడులు  చేస్తుంటాం ఉసిరితో.. వాటితో పాటు పిల్లలు ఇష్టంగా తినే జాం, మురబ్బా, రైస్, వంటివి కూడా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా.. ఈ వారమంతా ఉసిరితో రకరకాల వెరైటీ వంటకాలు చేయడం ఎలానో నేర్చుకుందాం...

 

ముందుగా ఈ రోజు

ఉసిరి ఆవకాయ
ఉసిరి నిల్వ పచ్చడి

 

 

ఉసిరి ఆవకాయ

 


 తయారు చేసేటప్పుడు కొంచం జాగ్రత్త  తీసుకుంటే సంవత్సరమంతా నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ .

 

కావలసినవి :
ఉసిరికాయలు - అర కేజీ
నూనె - పావు కేజీ
ఉప్పు - 50 గ్రాములు
కారం - 50 గ్రాములు
ఆవపొడి - 50 గ్రాములు
మెంతులు - అర స్పూన్

 

 

తయారీ :
ఉసిరికాయలని కడిగి, తడి లేకుండా పొడి బట్టతో తుడవాలి. ఆ  తరువాత చాకుతో అక్కడక్కడ నిలువుగా గాట్లు పెట్టాలి. మూకుడులో నూనె పోసి కొంచం కాగాకా ఉసిరికాయలను వేసి సన్నని మంట మీద వేయించాలి. కొంచం ఎరుపు రంగు వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత నూనె చల్లబడే వరకు పక్కన పెట్టాలి. ఆ తరవాత ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, ఉసిరి కాయలు , నూనె మిశ్రమంలో కలపాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. అన్ని బాగా కలిసాకా పొడి సీసాలోకి  తీసిపెట్టుకుని ఒక రోజు తర్వాత వాడుకుంటే రుచిగా వుంటుంది.

 

Note :

కొంత మంది నిమ్మరసం కూడా కలుపుతారు. అలా కలపాలంటే ఓ పావుకప్పు నిమ్మరసాన్ని పై మిశ్రమంలో ఆఖరున కలిపితే సరిపోతుంది.

 

 

ఉసిరి నిల్వ పచ్చడి

 

 

 

 

ఈ పచ్చడిని మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని  చెబుతారు. ఇది సంవత్సరం అంత నిల్వ ఉండే పచ్చడి.

 

కావలసినవి :
ఉసిరికాయలు: ఒక కేజీ
ఉప్పు: అర కేజీ
పసుపు : ఒక స్పూన్

పోపుకి :
ఎండు మిర్చి
ఆవాలు
ఇంగువా

 

తయారీ:
ముందుగా ఉసిరికాయలను కడిగి పొడి బట్టతో తుడవాలి. ఆ తర్వాత నాలుగు  ముక్కలుగా కోసి మధ్యలో గింజ తీసేయ్యాలి. ఆ తర్వాత ఉప్పు , పసుపు కలిపి పొడిగా వున్న సీసాలోకి తీసి పెట్టాలి. మూడురోజుల తర్వాత తీసి చూస్తే ముక్క మెత్తబడి ఉంటుంది. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని కారం కలిపి ఆవాలు , ఇంగువతో, పోపు చేసుకోవాలి.

 

Note :

*కొంత మంది పచ్చడి రుబ్బి పెట్టుకుని అప్పుడప్పుడు కొంచం కొంచం తీసి పోపు చేసుకుంటారు. తాజా పోపు రుచి బావుంటుందని.
* అలాగే కొందరు  పొడి కారం బదులు పచ్చిమిర్చి వేసి రుబ్బుకుంటారు. పచ్చిమిర్చి తో ఉసిరి పచ్చడి రుచి చాలా బావుంటుంది .
* అలాగే ఆవాలు ఎండు మిర్చి  వేయించి  పొడి చేసి కలుపుతారు పొడి కారం బదులు. దీనిని  ఇంగువాతో పోపు చేస్తే చాలా రుచిగా వుంటుంది.

 

- రమా