మామిడికాయ మెంతిబద్దలు
నిన్న మామిడి తొక్కుడు పచ్చడి చూశాం కదా. ఈరోజు మామిడికాయ మెంతిబద్దలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మామిడికాయలు -- 4
మెంతులు -- 2 స్పూన్స్
ఆవాలు -- 2 స్పూన్స్
ఉప్పు -- 6 చెంచాలు
ఎండుమిర్చి -- 20
పసుపు -- చిటికెడు
ఇంగువ -- 1/2 స్పూన్
తయారీ విధానము:
ముందుగా మామిడికాయలు చెక్కుతీసుకుని, సన్న ముక్కలుగా చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొంచెం నూనె వేసి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించి చివరగా ఇంగువ వేసి దించెయ్యాలి. చల్లారాకా వీటిని మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి. మెంతి పొడి రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఒక పాత్రలో తరిగిన మామిడి ముక్కలు, మిక్సీ చేసిన పొడి, ఉప్పు, పసుపు మిగిలిన నూనె అన్నీవేసి కలిపి మూతపెట్టుకుని ఉంచాలి. రెండోరోజు నుండి దీనిని వాడుకోవచ్చును. పుల్లగా, కొంచం చిరు చేదుగా, కారంగా ఈ పచ్చడి చాలా రుచిగా వుంటుంది. ఇదే పచ్చడిలో బెల్లం వేసి కలిపితే బెల్లం మెంతికాయ అంటారు. ఆ బెల్లం మెంతికాయ పచ్చడి దోశలలోకి చాలా బావుంటుంది.
మరి ఈ మామిడి మెంతి బద్దలు పచ్చడి వెంటనే పెట్టేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. రేపు మరో వెరైటీ మామిడి పచ్చడి గురించి చెప్పుకుందాం.
శ్వేతా వాసుకి